టీలో లోక్ సభ ఎన్నికలకు ఖర్చు ఎంతంటే?

Sat Feb 09 2019 11:21:43 GMT+0530 (IST)

ఎన్నికలు వస్తున్నాయంటే వాతావరణం మహా జోష్ గా మారుతుంది. అధికారపక్షమే కాదు.. అప్పటివరకూ ఉత్సాహంగా కనిపించని విపక్షాలు సైతం ఒక్కసారిగా యాక్టివ్ అయిపోతాయి. ఎన్నికల నోటిఫికేషన్ మొదలు ఎన్నికల ఫలితాలు విడుదల వరకూ ఎవరికి క్షణం తీరిక ఉండనంత బిజీగా మారిపోతుంటారు.ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారీ ఎత్తున జరిగే ఎన్నికల ఏర్పాట్ల కోసం జరిగే ఖర్చు లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు రూ.350 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు. ఈ లెక్కన పాతిక లోక్ సభ స్థానాలు ఉన్న ఏపీలో ఖర్చు మరింతగా ఉంటుందని చెప్పక తప్పదు.

ఈ ఖర్చును లెక్కలోకి తీసుకుంటే.. దేశ వ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల ఖర్చుకు వేలాది కోట్ల రూపాయిల ప్రజాధనం ఖర్చు అవుతున్నట్లే. ఎన్నికల నిర్వహణకు జరిగే అధికారిక వ్యయం ఇంత భారీగా ఉంటే.. ఇక ఎన్నికల బరిలో దిగిన నేతలు పెట్టే ఖర్చు లెక్కలు వేస్తే.. భారీగా ఉంటుందని చెప్పాలి.

ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు మొత్తం ప్రజలు కట్టిన పన్ను మొత్తమే. తమ ముక్కుపిండి వసూలు చేసే పన్నుతో నిర్వహించే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏ మాత్రం తేడా దొర్లినా అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఎన్నికలన్న వెంటనే అందరిలోనూ అదోలాంటి జోష్ వస్తుందే తప్పించి.. ఇంత భారీ ఖర్చు ఉంటుందన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరని చెప్పక తప్పదు.