Begin typing your search above and press return to search.

టీ. ఎన్నికల విచిత్రం.. చిన్న నోట్ల వేట..

By:  Tupaki Desk   |   22 Oct 2018 8:32 AM GMT
టీ. ఎన్నికల విచిత్రం.. చిన్న నోట్ల వేట..
X
తెలంగాణ ఎన్నికల వేళ విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నాయకులందరూ ఇన్నాళ్లు దాచుకుంటున్న కట్టలు పాములు బయటకు వస్తున్నాయి. రూ.2వేల నోట్లను భారీగా దాచేసిన నేతలు ఇప్పుడు డబ్బులు పంచేందుకు వీలుగా రూ.2వేలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారట.. చిల్లర సమస్యను తీర్చుకోవడానికి వారు బ్యాంకులు - పెట్రోల్ బంకులను ఆశ్రయిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థులందరూ ఇప్పుడు పెద్ద నోట్లు అయిన రూ.2వేలను రూ.500 - రూ.200 నోట్లుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారట.. ఇలా నోట్లు మార్పిడి చేసేవారికి 2 నుంచి 5 శాతం వరకు కమీషన్ కూడా ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణలో లావాదేవీలపై గట్టి నిఘా ఉంది. దీంతో తెలంగాణ నేతలు ఇప్పుడు పక్కరాష్ట్రాలపై దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్ - కర్ణాటకలోని ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ మార్చి తీసుకొస్తున్న రూ.500 నోట్లు ఇటీవల ఆదిలాబాద్ సహా పలుచోట్ల పట్టుబడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణలో ఇప్పుడు భారీ నగదు లావాదేవీపై ఐటీ - ఆర్బీఐ నిఘావేశాయి. రూ.2 లక్షలకు మించి నగదు తీసుకునే వారి వివరాలను సేకరిస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. రూ.5 లక్షలకు మించితే కారణాలను లిఖిత పూర్వకంగా తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ నేతలు చిన్న నోట్ల కోసం విశాఖ - విజయవాడలోని తమ కార్యాలయాలు సంప్రదించినట్టు ఆ బ్యాంకు అధికారులు చెబుతున్నారు.