Begin typing your search above and press return to search.

కోదండం మాష్టార్ని ముందస్తుగా అరెస్ట్ చేసేశారు

By:  Tupaki Desk   |   22 Feb 2017 4:33 AM GMT
కోదండం మాష్టార్ని ముందస్తుగా అరెస్ట్ చేసేశారు
X
సీమాంధ్ర పాలకులు.. సీమాంద్ర పాలకులంటూ అనునిత్యం విరుచుకుపడే కోదండం మాష్టారికి.. ఉమ్మడి రాష్ట్రంలో.. సీమాంధ్ర ప్రభుత్వంలో ఎదురుకాని అనూహ్య పరిణామం.. ఆయన కలలు కని.. పోరాడి.. సాధించుకొన్న తన సొంత తెలంగాణ రాష్ట్రంలో భారీ షాక్ తగిలింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరుద్యోగుల సమస్యల మీద ర్యాలీనిర్వహించాలని.. శాంతియుతంగా ధర్నా చేపట్టాలని నిర్ణయిస్తే.. కేసీఆర్ సర్కారు దాన్ని ఎంతగా తొక్కేశారన్నది తాజాగా చోటు చేసుకున్న వైనం చూస్తే షాకింగ్ గా మారినట్లేనని చెప్పాలి.

ప్రజా ఉద్యమాల మీద ఉద్యమనేత పాలకుడిగా మారితే ఎంత కఠినంగా వ్యవహరిస్తారన్న దానికి కేసీఆర్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం చూస్తే.. ఉద్యమాల విషయంలో ఎంత కఠినంగా ఉండాలో చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి. అనుమతి లేకున్నా నిరుద్యోగ ర్యాలీ.. సభను నిర్వహిస్తామని తేల్చి చెప్పిన టీజేఏసీ ప్రకటనతో పోలీసులు ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న కోదండం మాష్టార్ని బుధవారం తెల్లవారుజామున అనూహ్యంగా అరెస్ట్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో భారీ ఎత్తున తలపెట్టిన కార్యక్రమాల కారణంగా.. తీవ్ర ఉద్రిక్తలు చెలరేగినా.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ.. కోదండం మాష్టార్ని టచ్ చేయటానికి నాటి సర్కారు వణికిపోయేది. అలాంటి కోదండాన్ని చిన్న ర్యాలీని పట్టుపట్టి నిర్వహించాలని చూస్తే.. అరెస్ట్ చేసి లోపలేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కోదండంను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనతో పాటు మరో 50 మంది జేఏసీ నేతల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిని ఎక్కడికి తీసుకెళ్లారన్న విషయంపై పోలీసులు ఎలాంటి సమాచారం బయటకు ఇవ్వకపోవటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆయన ఆచూకీని వెంటనే తెలియజేయాలంటూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

నిరుద్యోగుల ర్యాలీపై ఉక్కుపాదం మోపాలన్నట్లుగా కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. రాజధానికి రానున్న వివిద జిల్లాలకు చెందిన ఉద్యమకారుల్ని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవటంతో రాష్ట్రంలో కొత్త ఉద్రిక్తతలకు తెర తీసినట్లుగా చెప్పాలి. తమను ర్యాలీ చేయకుండా అడ్డుకునేందుకు అరెస్ట్ చేస్తే.. పోలీస్ స్టేషన్లలోనే తమ నిరసన తెలుపుతామంటూ జేఏసీ నేతలు ఇప్పటికే ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. అన్నింటికి మించి ఆందోళన కలిగించే అంశం.. ప్రొఫెసర్ కోదండాన్ని పోలీసులు ఎక్కడకు తీసుకెళ్లారన్న విషయం మీద స్పష్టత ఇవ్వకపోవటమే. ఇదిలా ఉంటే.. హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ పరిధిలో అదనపు బలగాల్ని మొహరించటమేకాదు.. దాదాపుగా 12 వేల మంది పోలీసులతో నగరాన్ని అష్టదిగ్బందనం చేసిన వైనం చూస్తే.. నిరుద్యోగ నిరసనను ఆదిలోనే తుంచేయాలని.. నిరసనల్ని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదన్న విషయాన్ని తాజా ఉదంతంతో స్పష్టం చేసినట్లుగా భావించాలి.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంతో పాటు.. కోచింగ్ సెంటర్లు భారీగా ఉండే ప్రాంతాలపై పోలీసులు తమ ఫోకస్ ను డబుల్ చేసినట్లుగా చెబుతున్నారు. మంగళ వారం సాయంత్రం నుంచి నగరాన్ని పోలీసులు కమ్మేసిన వైనం కనిపిస్తోంది. అనూహ్యంగా కోదండం మాష్టారన్ని ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవటంతో.. నిరుద్యోగ ర్యాలీని భగ్నం చేసే విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో తెలిసేలా చేస్తుందని జేఏసీ నేతలు పలువురు చెప్పటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/