Begin typing your search above and press return to search.

డిసెంబరు 1న..25వేల మందికి అపాయింట్మెంట్

By:  Tupaki Desk   |   5 Aug 2015 4:33 AM GMT
డిసెంబరు 1న..25వేల మందికి అపాయింట్మెంట్
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలే ఉద్యోగాలుగా భావించిన వారి కల ఇంకా నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్ర సర్కారు కొలువు తీరి పద్నాలుగు నెలలు అవుతున్నా.. ఒక్క ఉద్యోగం ఇంకా రాలేదు. ఆ కొరత తీరుస్తూ.. ఈ మధ్యనే కొత్త కొలువులకు నోటిఫికేషన్ జారీ చేయటం తెలిసిందే.

ఎలాంటి వివాదాలు.. ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా..ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగాల భర్తీ కోసం తొలుత 15,222 పోస్టులను జారీ చేసిన సర్కారు కేవలం నాలుగు రోజుల వ్యవధిలో మరో పది వేల నియమకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తెలిసిందే.

ఈ పాతిక వేల పోస్టల భర్తీకి సంబంధించి తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేసేసి.. డిసెంబర్ 1 నాటికి పాతికవేల పోస్టులకు సంబంధించిన అపాయింట్ మెంట్ లెటర్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఎలాంటి పొరపాటు దొర్లకూడదని.. షెడ్యూల్ ప్రకారం మొత్తం ప్రక్రియ పూర్తి కావాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

అంతేకాదు.. డిసెంబర్ 1న పాతిక వేలమందికి అపాయింట్ మెంట్ లెటర్ ఇవ్వటమే కాదు.. అదే నెలలో రెండు.. మూడు వారాల్లో మరో పాతికవేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. ఈ ప్రకియను మార్చి నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో.. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ తామిచ్చిన హామీ నెరవేర్చుకోవాలన్న పట్టుదలలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు.

ఉద్యోగుల భర్తీ ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారని.. ఉద్యోగాల విషయంలో విపక్షాలు చేస్తున్న వాదన తప్పు అని తేల్చటంతో పాటు.. ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీల్ని నెరవేర్చటంలో ఎంత నిబద్ధతతో ఉన్నామన్న విషయాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ సీఎం ఉన్నట్లు చెబుతున్నారు.