Begin typing your search above and press return to search.

న‌గ‌దు స‌మ‌స్య‌కు కేసీఆర్ సూప‌ర్ ప‌రిష్కారం

By:  Tupaki Desk   |   23 April 2018 4:37 AM GMT
న‌గ‌దు స‌మ‌స్య‌కు కేసీఆర్ సూప‌ర్ ప‌రిష్కారం
X
ఔను. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక రికార్డు సృష్టించారు. ఆర్‌ బీఐని ఒప్పించిన ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ నిలిచారు. దేశంలోనే మొద‌టి ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప్ర‌త్యేక‌త‌ను నిలిపింది. అదే స‌మ‌యంలో సామాన్యుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపారు. ఇకనుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఏటీఎం లేదా బ్యాంకులకే వెళ్లాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాల్లో కూడా నగదును పొందవచ్చు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన వెంటనే రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. టీ వ్యాలెట్ యాప్‌ లో నమోదై ఉన్న ప్రతి ఖాతాదారుడు మీసేవ ద్వారా నగదును డ్రా చేసుకోవచ్చు.

కొంతకాలంగా ప్రజలు తీవ్ర నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నగదు కొరత సమస్యపై స్పందించిన రాష్ర్టప్రభుత్వం ఒకవైపు బ్యాంకర్లతో చర్చలు జరుపుతూనే మరోవైపు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది. రాష్ట్రంలోని మీ సేవ కేంద్రాల ద్వారా నగదు చెల్లిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత వర్గాలు చర్చించగా...మీ సేవ కేంద్రాల ద్వారా నగదు చెల్లించవచ్చని - ఇందుకు ఆర్బీఐ అనుమతి అవసరమనే విషయం గ‌మ‌నించారు. దీంతో రాష్ట్రప్రభుత్వం ఇందుకు అనుమతి కోరుతూ ఆర్బీఐకి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక ప్రతిపాదనతో ముందుకురావడం, నగదు సమస్యకు పరిష్కారం చూపించే గొప్పమార్గంగా భావించిన ఆర్బీఐ వెంటనే అంగీకారం తెలిపింది. ఈ మేరకు త్వరలోనే అధికారిక అనుమతులు రానున్నట్టు తెలిసింది. అనంతరం రాష్ట్రంలోని 4,500 మీ సేవ కేంద్రాల్లో ఎక్కడైనా డబ్బులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు అధికారికంగా వ్యాలెట్‌ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంస్థలతోపాటు - ప్రైవేటురంగంలోనూ డిజిటల్ చెల్లింపులకు అవకాశం కలిగింది. ప్రస్తుతం నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇదే యాప్ ద్వారా డబ్బు డ్రా చేసుకునే అవకాశాలను పరిశీలించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాలను వినియోగించుకునేందుకు వీలుగా ఆర్బీఐకి లేఖ రాసింది. ఆర్బీఐ నుంచి అనుమతులు వస్తే ఈ విధానాన్ని వినియోగించుకుంటున్న మొదటి రాష్ట్రంగా కూడా తెలంగాణ రికార్డు సృష్టించనుంది. మీసేవ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే ముందుగా టీ వ్యాలెట్‌ లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారు టీ వ్యాలెట్‌ను డౌన్‌ లోడ్ చేసుకుని ఈ సదుపాయాన్ని పొందవచ్చు. స్మార్ట్‌ ఫోన్ - అసలు ఫోన్ లేకపోయినా వ్యాలెట్‌ ను ఉపయోగించుకోవచ్చు. దగ్గరలోని మీసేవ కేంద్రానికి వెళ్లి యూఐడీ వివరాలు అందించి టీ వ్యాలెట్‌ లో ఖాతాను నమోదు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా బయోమెట్రిక్ వివరాలు అందించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే తదుపరి దశలో నగదు లావాదేవీలు చేసుకోవడానికి వీలుంటుంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లయినా రోజుకు రెండువేల వరకు డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. కాగా, టీ వ్యాలెట్‌ లో రెండుమార్గాల ద్వారా డబ్బులు వేసుకునేందుకు వీలుంటుంది. బ్యాంక్‌ ఖాతా ద్వారా ఆన్‌ లైన్ రూపంలో డిపాజిట్ చేయవచ్చు లేదా నగదును నేరుగా టీ వ్యాలెట్ ఖాతాలో జమచేసుకోవచ్చు.