Begin typing your search above and press return to search.

ఛ‌త్తీస్ గ‌ఢ్ తో 'ప‌వ‌ర్' లింక్ క‌టీఫ్‌!

By:  Tupaki Desk   |   13 Jun 2018 5:05 AM GMT
ఛ‌త్తీస్ గ‌ఢ్ తో ప‌వ‌ర్ లింక్ క‌టీఫ్‌!
X
రాష్ట్ర విభ‌జ‌న తొలినాళ్ల‌లో తెలంగాణ రాష్ట్ర ఎదుర్కొనే అతి ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల్లో విద్యుత్ స‌మ‌స్య ఒక‌టిగా భారీ ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. తెలంగాణ వ‌స్తే చీక‌ట్లే అంటూ చేసిన వ్యాఖ్య‌లు రేపిన రాజ‌కీయ దుమారం అంతా ఇంతా కాదు. తెలంగాణ‌లో క‌రెంట్ స‌మ‌స్య ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో.. ఏపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల్ని ఛాలెంజ్ గా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.

ఇందుకోసం ఆయ‌న స్వ‌యంగా ఛ‌త్తీస్ గ‌ఢ్ రాజ‌ధాని రాయ్ పూర్ కు వెళ్లి.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రితో క‌లిసి ప్ర‌త్యేకంగా ఒప్పందం చేసుకున్నారు. నాటి ఒప్పందం పుణ్య‌మా అని తెలంగాణ‌కు విద్యుత్ స‌మ‌స్య దాదాపు త‌గ్గిపోయిన ప‌రిస్థితి. ఇప్ప‌టికే తీసుకుంటున్న వెయ్యి మెగావాట్ల విద్యుత్ తో పాటు కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సైతం మ‌రో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అవ‌స‌ర‌మ‌ని.. దాన్నికూడా ఛ‌త్తీస్ గ‌ఢ్ నుంచి తీసుకుంటామ‌న్న మాట‌ను ఇవ్వ‌టం జ‌రిగింది.

ఇదిలా ఉంటే.. తాజాగా విద్యుత్ ఛార్జీల ధ‌ర‌ల్ని పెంచే ఆలోచ‌న‌లో ఉన్న వైనాన్ని చెబుతూ.. ఆ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోళ్లు చేప‌ట్టే ఒప్పందానికి క‌టీఫ్ చెప్పేసింది తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌.

ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రంతో పోలిస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు త‌క్కువ‌గా ఉండ‌టంతో వేరే రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. వ‌చ్చే జులై 16 నుంచి సెప్టెంబ‌రు 30 మ‌ధ్య‌న ఉండే కాలంలో రోజు ఉద‌యం వేళ‌లో 12 గంట‌ల పాటు విద్యుత్ ను కొనుగోలు చేయ‌టానికి ప్ర‌తిపాద‌న‌ల్ని సిద్ధం చేసింది. ఇందుకు అవ‌స‌ర‌మైన టెండ‌ర్ల‌ను ఆహ్వానించ‌నుంది.

వాస్త‌వానికి 2014లో తెలంగాణ స‌ర్కార్ ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రంలో కుద‌ర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం వెయ్యి మెగావాట్ల‌ను 12 ఏళ్ల పాటు కొనుగోలు చేసేందుకు వీలుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతేకాదు.. రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన మ‌రో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ ప్ర‌తిపాద‌న‌పై అప్ప‌ట్లో ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. నిజానికి ఈ ఒప్పందం కార‌ణంగానే తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ సంక్షోభాన్ని చాలావ‌ర‌కూ త‌గ్గించుకుంద‌ని చెప్పాలి.

ఇదిలాఉంటే.. ఛ‌త్తీస్ గ‌ఢ్ విద్యుత్ యూనిట్ రూ.3.70 నుంచి రూ.4.70 వ‌ర‌కు పెంచాల‌ని కోరుతూ ఆ రాష్ట్ర విద్యుదుత్ప‌త్తి సంస్థ ఇటీవ‌ల ఛ‌త్తీస్ గ‌ఢ్ ఈఆర్సీలో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ధ‌ర‌లు పెంపు విష‌యంపై నిర్ణ‌యం తీసుకుంటున్న వేళ‌.. తెలంగాణ విద్యుత్ శాఖ అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఛ‌త్తీస్ గ‌ఢ్ నుంచి విద్యుత్ తీసుకోమ‌ని ప్ర‌క‌టించింది. దానికి బ‌దులు మ‌రో ప్ర‌త్యామ్నాయం మీద దృష్టి పెట్టింది. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు స‌ద‌రు రాష్ట్రానికి వెళ్లి మ‌రీ సాయం చేయాల‌ని కోరి..ఇప్పుడు రేటు బూచి చూపించి ఒప్పందానికి క‌టీఫ్ చెప్ప‌టం ఏమిట‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. అయినా.. ధ‌ర‌ల పెంపు విష‌యం మీద ముందే వివ‌రంగా మాట్లాడుకోలేదా అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై ఛ‌త్తీస్ గ‌ఢ్ ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.