Begin typing your search above and press return to search.

కేసీఆర్ చెక్కులు బౌన్స్ అవుతున్నాయ్

By:  Tupaki Desk   |   23 Oct 2016 10:08 AM GMT
కేసీఆర్ చెక్కులు బౌన్స్ అవుతున్నాయ్
X
ధనిక రాష్ట్రం.. సంపన్న రాష్ట్రం అంటూ తరచూ గొప్పలు చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ మధ్యన తరచూ షాకులు తగులుతున్నాయి. పేరుకు సంపన్న రాష్ట్రమే అయినప్పటికీ.. పలు కీలక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిధులు సకాలంలో విడుదల కాని నేపథ్యంలో ఆయా పథకాల అమలును ఆపివేస్తూ నిర్ణయం తీసుకోవటం.. ఈ వైనం తెలంగాణ సర్కారు ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలతో సీఎం కేసీఆర్ సైతం సీరియస్ అయ్యారు. ఆదాయం పెరుగుతున్నా.. చెల్లింపుల విషయంలో ఎందుకిన్ని తప్పులు జరుగుతున్నాయంటూ కీలక అధికారుల్ని నిలదీస్తున్న పరిస్థితి.

నిన్నటికి నిన్న.. తెలంగాణ రాష్ట్రంలో రూపాయి రాక.. రూపాయి పోకకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన వేళ.. ఆయనకు మరో షాకింగ్ వార్తగా చెప్పాల్సిందేమంటే.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాకుండా ఉండటమేకాదు.. బ్యాంకుల్లో బౌన్స్ అవుతున్న వైనం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. ఓపక్క సంపన్న రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పలు చెబుతుంటే.. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాకపోవటంపై చెక్కులు అందుకున్న వారు అయోమయానికి గురి అవుతున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన కథనాలు పలు మీడియా సంస్థల్లో ప్రసారమవుతున్నాయి.

ఇలాంటి వార్తల కారణంగా తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న మాట పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన చెక్కులు చెల్లుబాటు కాకపోవటానికి అసలు కారణం వేరుగా ఉందని చెబుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన వేళ.. చెక్కుల్ని చెల్లించకుండా తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. చెక్కులు బౌన్స్ కావటం వెనుక అసలు కారణం వేరే ఉందని.. దానికి రాజకీయంగా తప్పుడు వాదనల్ని జత చేస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజంగా జరిగి ఉంటే.. ఇందులోనూ ప్రభుత్వాన్నే తప్పు పట్టాల్సిందే. చెక్కులు చెల్లకుండా ఆపిన విషయాన్ని ప్రభుత్వ అధికారులు మొదటే ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించినా బాగుండేది. అలా కుదరదని అనుకుంటే.. ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా గొడవ లేకుండా ఉండేది. అదేమీ లేకుండా.. అధికారులు తాము అనుకున్న విషయాన్ని తమలోనే ఉంచేసుకోవటంతో.. ప్రభుత్వం ఇచ్చిన చెక్కుల్ని రైతులు బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం.. అవి కాస్తా బౌన్స్ అయినట్లుగా తెలుస్తోంది. నిధుల చెల్లింపుల్లో ఎలాంటి తప్పు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అధికారులతో చెబుతున్న వేళ..నిర్వాసితులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావటంపై తెలంగాణ ఏమంటుందో ..? ఎలా రియాక్ట్ అవుతుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/