మిషన్ భగీరథ... రైతులకు శాపమై కూర్చుందా?

Fri Aug 10 2018 07:00:27 GMT+0530 (IST)

ఖరీఫ్ సీజన్ నాటు వేసే ముగింపు దశకు వచ్చింది. రైతులు విత్తిన పంటలు నీరు లేక విలవిలాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో కురవాల్సిన వర్షపాతం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయింది. దీంతో రైతులు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటాయి. తెలంగాణ రైతులు వర్షాలపైనే ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితి. ఆగస్ట్ నెల రెండో వారంలోకి ప్రవేశించింది. ఆకాశంలో మబ్బులే తప్ప ఎక్కడా చినుకు జాడ లేదు. ఈ సారి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతవరణ శాఖ ప్రకటించినా వరుణుడు కరుణించలేదు. దీంతో తెలంగాణలో భూములన్ని వర్షల కోసం నోళ్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే నాటిన విత్తులు మొలకెత్తాల్సి ఉంది. అయినా ఏ జిల్లాలోను అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. వర్షాలు కురియక పోవడంతో చెరువులు బావులు ఎండిపోయి ఏడారిని తలపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ జిల్లాలలో దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీరు చేరలేదు. సాగర్ ప్రాజెక్టు నుంచి భూములకు కనీసం 54 టీఎంసీల నీరు అవసరమవుతుంది. అయితే నాగర్జున సాగర్‌లో అవసరానికి తగ్గ నీరు లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు అందించలేమంటూ ఇంజనీరుల కమీటి చేతులెత్తేసింది. తెలంగాణలో వ్యవసాయానికి కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజేక్టు కూడా నీరు లేక గొంతెండిన రైతులా ఉంది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 16 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇది రైతులకు ఎంత మాత్రం సరిపోదు. ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ వ్యవసాయ పనులు లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ ప్రాజెక్టు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారింది.

ప్రతీ ఇంటికి కుళాయిలా ద్వారా మంచినీరు అందిచాలన్నది భగీరథ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం రైతులకు నీరందించే వివిధ ప్రాజెక్టుల నుంచి నీటిని భగీరథకు మళ్లిస్తున్నారు. ప్రతీ ఇంటికి తాగు నీరు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామన్న కేసీఆర్ వాగ్దానం కోసం రైతులను బలిపశువులను చేస్తున్నారు. వారికి కేటాయించాల్సిన నీటిని భగీరధలో నిలువ చేసి పంటలు ఎండిపోయేలా చేస్తున్నారు. దీనిపై రైతులలో ఆగ్రాహావేశాలు పెరుగుతున్నాయి. రైతుబంధు - రుణమాఫీ వంటి పథకాలతో రైతు ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్న కేసీఆర్ కు భగీరధ ప్రాజేక్టు పెద్ద అడ్డంకిగా మారే పరిస్థితులు వస్తున్నాయి.