ఆలస్యం కానున్న ఎన్నికల ఫలితాలు

Mon Dec 10 2018 14:25:49 GMT+0530 (IST)

ఎన్నికల ఫలితాలు ఆలస్యం కానున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈసారి ఎన్నికల కమిషన్ కొత్త నిబంధనలు తీసుకురావడంతో తుది ఎన్నికల ఫలితం వెల్లడి మరో రెండు గంటలు ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఈ సంఘటన అభ్యర్థుల గుండెల్లో మరింత ఉత్కంఠను రేపుతుంది.మంగళవారం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది. గతంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో ప్రతీ రౌండ్ ఫలితాలు వెంటనే బయటకు ప్రకటించేవాళ్లు. ఈసారి ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఫలితాలు ఆలస్యం కానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రతీ రౌండ్ ఫలితాన్ని స్టేట్ మెంట్ రూపంలో ముందు పోటీచేసిన అభ్యర్థులకు ఇస్తారు. వారు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోతే దానిపై రిటర్నింగ్ అధికారి సంతకం చేసి మీడియాకు ఇస్తారు.

అంతేకాకుండా ఆ రౌండ్ ఫలితాన్ని వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తారు. ఇలా ప్రతీ రౌండ్ ఫలితం స్టేట్ మెంట్ రూపంలో పెట్టిన తర్వాతే ఫలితం ప్రకటిస్తారు. దీంతో చివరి ఫలితం గతంలో కంటే మరో రెండు గంటల ఆలస్యం అవచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

ప్రతీ రాష్ట్రంలో ఈ నిబంధన మంగళవారం నుంచి ఎన్నికల అధికారులు అమలు చేయనున్నారు. ఇక తెలంగాణలో 119 నియోజకవర్గాల కౌంటింగ్ కోసం 31 జిల్లా కేంద్రాల్లో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈసారి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠతోపాటు ఆసక్తిని రేపుతున్నాయి. హోరాహోరీగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలపై ఎవరి ధీమా వారే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఆలస్యం కావడంతో ఈ ఉత్కంఠ మరింత పెరుగనుంది