రేపే విడుదల...ఎవరు రాజు...ఎవరు మంత్రి

Mon Dec 10 2018 13:32:12 GMT+0530 (IST)

ఉత్కంఠ... ఎదురు చూపులు... భయాందోళనలు... అనుమానాలు... అన్నింటికి మంగళవారంతో తెర పడనుంది. మూడు నెలల ముందస్తు సమరం మంగళవారం ఉదయం పది గంటలకు తేలిపోనుంది. ఎవరు విజేతలు... ఎవరు పరాజితులు.. ఎవరు అధికార పీఠం ఎక్కుతారు... ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారు. ఇంకా 24 గంటలా అని కొందరికి... ఇక 24 గంటలే అని ఇంకొందరికి... క్షణమెక యుగంలా అభ్యర్ధులు - వారి అనుచరగణం కాలం గడుపుతున్నారు.ఓటేసిన వారు మాత్రం మా పని అయిపోయింది... ఐదేళ్ల పాటు తమను ఎవరు ఏలుతారో అని ఎదురుచూపులు చూస్తున్నారు. అభ్యర్ధుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై నవ్వుతోంది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఈవీఎంల లెక్క ప్రారంభమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఎక్కడా రీపోలింగ్ లేకుండా తొలిసారిగా ఎన్నికల కమిషన్ విజయవంతంగా ఎన్నికలను పూర్తి చేయడం విశేషం. ఒకటి - రెండు చెదురుమదురు సంఘటనలు జరిగినా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 44 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి కౌంటింగ్ సెంటర్ లోనూ 14 టేబుళ్ల వంతున ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కు ఒక్కో పర్యవేక్షకుడిని ఏర్పాటు చేశారు. వారికి సహాయం చేసేందుకు ఓ సహాయ పరిశీలకుడు - మరో సూక్ష్మ పరిశీలకుడు కూడా ఉంటారు. ప్రతి అభ్యర్ధి నుంచి ఒకరిని కౌటింగ్ పరిశీలకు అనుమతిస్తారు. ఇంతకు ముందే పరిశీలకులు - సహాయ పరిశీలకులు - సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. తొలి ఫలితం  9-30 గంటలకు వెలువడే అవకాశం ఉందంటున్నారు.

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు సర్వీసు - పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు. అనంతరం తొలి రౌండ్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి..ఏ అభ్యర్ధికి ఎన్ని వచ్చాయనేది కౌంటింగ్ సెంటర్ వెలుపల ఏర్పాటు చేసిన స్క్రీన్ లపై ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. ప్రతి రౌండ్ కు ఉత్కంఠ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికలు హోరాహోరీగా జరగడమే దీని కారణమంటున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకల్లా మొత్తం తెలంగాణలో ఎన్నికల ఫలితాలు అన్నీ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఎవరు రాజో... ఎవరు మంత్రో... ఎవరు విజేతో.. ఎవరు పరాజితో తేలిపోతుంది.