ఓటు ఒక చోట.. పోటీ మరోచోట..

Thu Dec 06 2018 17:07:20 GMT+0530 (IST)

తెలంగాణ ఎన్నికలకు వేళయ్యింది. ఇప్పటికే అభ్యర్థులంతా ఊరురూ తిరిగి అయ్యా.. అవ్వా మీ ఓటు మాకే వేయాలని అభ్యర్థించారు. నాకు ఓటేస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అంటూ హామీ ఇస్తారు. రేపే పోలింగ్ జరగబోతోంది. ఇంత చేసిన అభ్యర్థులు మాత్రం వారి ఓటను వారే వేసుకోలేని నిస్సహాయ స్థితి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన పలువురు నేతలకు ఎదురవుతోంది. సమీకరణాలు సీట్లు సర్దుబాటు కారణంగా తెలంగాణలోని ప్రముఖ నేతలందరూ తమ సొంత స్థానాల్లో కాకుండా మరోచోట పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దఫా తెలంగాణ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ సొంత నియోజకవర్గాల్లో ఓటును వినియోగించుకోలేకపోతున్నారు.

తమ ఓటును తాము వేసుకోలేని నేతల్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ - టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి - మంత్రులు - మాజీ మంత్రులు - ఎమ్మెల్యేలు - మాజీ ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో కనీసం 50మంది ప్రముఖులు తమ ఓటు తాము వేసుకొని పరిస్థితి లేకుండా పోయింది.

* నేతలు పోటీచేస్తున్న స్థానాలు.. ఓటేస్తున్న స్థానాలివే..

* ముఖ్యమంత్రి కేసీఆర్.. గజ్వేల్ నుంచి రెండోసారి పోటీచేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ స్థానాలు మారుతూ వస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాణిస్తున్న ఆయన ఓటు వేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే  కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నప్పటీకీ ఆయన ఓటు మాత్రం సిద్దిపేట నియోజకవర్గంలో ఉంది. కాబ్టటి కేసీఆర్ రేపు సతీసమేతంగా అక్కడ పోటీచేస్తున్న హరీష్ రావుకు ఓటు వేస్తారు. సిద్దిపేట మండలం చింతమడక గ్రామం బూత్ నంబర్ 13లో ఉదయం 8 గంటలకు కేసీఆర్ దంపతులు ఓటేస్తారు. ఇక హరీష్ రావు కూడా దాదాపు అదే సమయానికి సిద్దిపేట పట్టణం బూత్ నంబర్ 107 అంబిటస్ స్కూల్లోని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా ఓటు వేస్తారు.

* ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఇదే పరిస్థితి. ఆయన ఓటు హక్కు కోదాడలో ఉండగా.. హుజూర్ నగర్ నుంచి పోటీచేస్తున్నారు. ఉత్తమ్ తన ఓటును అక్కడ పోటీచేస్తున్న తన భార్య పద్మారెడ్డికి వేయబోతున్నారు.

* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నా ఆయన ఓటు మాత్రం స్వస్థలమైన అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది.

* తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీచేస్తున్నప్పటికీ ఆయన ఓటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది..

* స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి నుంచి పోటీచేస్తుండగా.. ఆయనకు ఓటు మాత్రం పరకాలలో ఉంది.

* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి బరిలో ఉండగా.. ఆయనకు ఓటు మాత్రం ఖమ్మం అసెంబ్లీలో ఉంది.

* సనత్ నగర్ నుంచి పోటీచేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కంటోన్మెంట్ లో ఓటు హక్కు ఉంది.

* సికింద్రాబాద్ నుంచి పోటీచేస్తున్న పద్మారావుకు ఓటు మాత్రం సనత్ నగర్ లో ఉండడం విశేషం.

* ఇక ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాటల మరాఠి దాసోజు శ్రవణ్ కు అంబర్ పేటలో ఓటు ఉంది.

* కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న సుహాసిని ఇల్లు మాసాబ్ ట్యాంక్ ఎన్ఎండీసీ పరిధిలో ఉంది. ఆమెకు ఓటు హక్కు నాంపల్లి పరిధిలో ఉంది.

* మేడ్చల్ నుంచి పోటీచేస్తున్న మల్లారెడ్డి ఓటు కంటోన్మెంట్ లో ఉంది.

* ఖైరతాబాద్ నుంచి పోటీచేస్తున్న చింతల రాంచంద్రారెడ్డి గడిచిన సారి శేరిలింగంపల్లిలో ఓటు వేశారు. ఈసారి మాత్రం ఖైరాతాబాద్ కు తన ఓటు మార్చుకోవడంతో తన ఓటు తానే వేసుకోబోతున్నారు.

* కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న షబ్బీర్ అలీ ఓటు ఖైరాతాబాద్ లో ఉంది.

* మరో కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డి ఓటు చేవెల్లలో ఉండగా.. ఆమె మహేశ్వరం నుంచి పోటీచేస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో పోటీచేస్తున్న 27మంది అభ్యర్థులు వారి ఓటును వారే వేసుకోలేని పరిస్థితి. ఎంతో బంపర్ మెజార్టీతో గెలుస్తున్న నేతల ఓట్లు సైతం సొంత నియోజకవర్గాల్లో లేకపోవడం విశేషంగా చెప్పవచ్చు.ఓటు ఎక్కడున్నా పోటీచేసే అవకాశం ఉండడంతో ఓటు ఒక చోట పోటీ మరోచోట అన్నట్టుగా సాగుతోంది.