Begin typing your search above and press return to search.

మరో మరక: లీకులో ‘ఏపీ’ వాళ్లే

By:  Tupaki Desk   |   31 July 2016 5:02 AM GMT
మరో మరక: లీకులో ‘ఏపీ’ వాళ్లే
X
తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించిన ఎంసెట్ – 2 పరీక్ష లీక్ వ్యవహారం ఇప్పుడా రాష్ట్ర సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారంటూ నిన్న మొన్నటివరకూ జబ్బలు చరిచిన తెలంగాణ సర్కారుకు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి. మల్లన్నసాగర్ ఇష్యూలో మొదలైన ఇబ్బందులు.. రోజులు గడిచే కొద్దీ మరిన్ని అంశాలకు వ్యాప్తి చెందటం తెలంగాణ సర్కారుకు కలిచివేస్తోంది. పాలనలో చోటు చేసుకున్న అసమర్థత.. చూసీచూడని తీరుతోనే ఇంత రచ్చ జరిగిందా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. అంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే.. నిఘా వ్యవస్థ నిద్రపోతుందా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే ఈ లీకు వ్యవహారంలో ఆసక్తికర కోణాన్ని ప్రభుత్వంలోని వారు తెరపైకి తీసుకురావటం గమనార్హం. లీకులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ స్నేహితుడి కంపెనీకి హస్తం ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న వేళ.. ప్రభుత్వంలోని ఒక వర్గం కొత్త వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు.

ఈ లీకు వ్యవహారంలో ఇప్పటివరకూ భాగస్వామ్యం ఉన్న వారు.. అరెస్ట్ అయిన వారంతా ఏపీకి చెందిన వారుగా చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ అంటూ.. ఇప్పటివరకూ అరెస్ట్ చేసిన వారి చిట్టా చదువుతున్నారు. సీఐడీ అదుపులోకి తీసుకున్న రాజగోపాల్ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నా.. అతగాడిది అనంతపురం జిల్లా అని.. రమేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన వాడని.. సబ్ బ్రోకర్లుగా పట్టుబడిన వారు కూడా ఏపీకి చెందిన వారిగా చెబుతున్నారు. ఇక.. పేపర్ లీకులో భాగస్వామ్యం ఉన్న కోచింగ్ సంస్థగా చెబుతున్న రెజొనెన్స్ మెడికల్ అకాడమీని నిర్వహిస్తున్న వెంకట రమణ సైతం కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి అని చెబుతున్నారు.

లీకు ఉదంతంలో భాగస్వామిగా వినిపిస్తున్న బండారు రవీంద్ర కూడా ఏపీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఒక నేరానికి సంబంధించి నేరస్తులు ఫలానా ప్రాంతానికి చెందిన వారంటూ ప్రత్యేకంగా ప్రస్తావించటం వెనుక లెక్కలు వేరుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రచారం మరింత పెరిగి ఇష్యూ తెలంగాణ నుంచి ఆంధ్రాకు డైవర్ట్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఇలాంటి ప్రచారం ఏపీకి మరకగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే లీకులో కీలకమైన ముంబై గ్యాంగ్ గురించి ప్రస్తావించటం లేదని.. వారంతా మహారాష్ట్రకు చెందిన వారు కదా? ఆ ప్రస్తావన తీసుకు రాకుండా ఏపీ పేరునే ప్రస్తావించం ఏమిటన్న మాట వినిపిస్తోంది. ఇది కూడా పాయింటే సుమి.