ఖర్చు తక్కువ..ఎఫెక్ట్ ఎక్కువగా టీ కాంగ్రెస్ ప్లానింగ్

Sun Oct 21 2018 10:38:53 GMT+0530 (IST)

ఆ మధ్యన విడుదలైన అతడు సినిమా గుర్తుందా?  ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్.. డబ్బులు టైటురా.. కాస్త సర్దుకొండిరా అంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్ట్ కోసం ప్రయత్నం చేయాలని చెప్పే తీరు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో విలన్ క్యారెక్టర్ చెప్పిన ఈ వ్యూహాన్ని తాజాగా తెలంగాణ కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారం కోసం వాడుతోందన్న మాట వినిపిస్తోంది.ఒకప్పుడు ఎంతగా వెలిగిపోయినా.. విపక్షంగా ఉన్న వేళలో ఆర్థిక వనరులకు ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ పరిమితిని గుర్తించి.. అందుకు తగ్గట్లు ప్లాన్ చేయటంఅంత తేలికైన విషయం కాదు. ఓపక్క తెలంగాణ అధికారపక్షంగా.. కేసీఆర్ నిర్వహిస్తున్న సభలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటే.. అందుకు భిన్నంగా తక్కువ బడ్జెట్ లో భారీ స్పందన ఉండేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాల్ని సిద్ధం చేస్తోంది. కోట్లాది రూపాయిల ఖర్చు పెట్టి.. సభల్ని నిర్వహించే పరిస్థితి లేకపోవటంతో.. తమకున్న పరిమితులతో సభల్ని ఏర్పాటు చేయటం కాంగ్రెస్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

చిన్న చిన్న సభలు.. జన సమీకరణ మీద ఎక్కువ వనరులు ఖర్చుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. ఎంపిక చేసుకున్న సభాప్రాంగణాలు చిన్నవిగా ఉండటం ద్వారా.. ఎంత మంది వచ్చినా ఎఫెక్ట్ అదిరేలా కాంగ్రెస్ నేతలు జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తోంది. ఉదాహరణకు శనివారం ఏర్పాటు నిర్వహించిన రెండు సభలు ఈ విషయాన్ని చెప్పేశాయి. భైంసా.. కామారెడ్డిలలో రాహుల్ గాంధీ సభల కోసం ఎంపిక చేసిన సభా స్థలిలో 50 వేల మందికి మించి పట్టని పరిస్థితి. చిన్న వేదిక కావటంతో ఒక మోస్తరుగా జనం వచ్చినా నిండిపోయే పరిస్థితి. దీంతో.. జన సమీకరణ మీద కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం లేకుండా పోయింది.

దీనికి తోడు.. ఈ సభలకు రాహుల్ రావటంతో ఒకరకమైన ఉత్సాహం. ఇదే.. భైంసా.. కామారెడ్డి సభలకు ప్రజలు విరగబడి వచ్చినట్లు కనిపించేలా చేసింది. రెండు చోట్ల సభలకు 60వేల మందికి పైగా ప్రజలు హాజరైతే.. సభలు జరిగిన రెండు ప్రాంతాల్లోనూ భారీ ట్రాఫిక్ జాంలు చోటు చేసుకున్నాయి.

భైంసాలో నిర్వహించిన సభ కారణంగా 10 కిలోమీటర్ల మేర రోడ్లు ట్రాఫిక్ తో జాం అయినట్లుగా చెబుతున్నారు. ఇంత స్పందనను ఊహించని కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.తాము అనుకున్న దాని కంటే ఎక్కువగా సభలు సక్సెస్ అయినట్లుగా వారి మాటలు చెబుతున్నాయి. దీనికి తోడు.. రాహుల్ ప్రసంగిస్తూ కేసీఆర్ ఫ్యామిలీ గురించి.. కేసీఆర్ అవినీతి గురించి ప్రస్తావించిన సమయాల్లో స్పందన బాగుండటం కాంగ్రెస్ నేతల్లో ఆనందాన్ని మరింత పెంచేలా చేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్ట్ ఉండాలన్నతమ వ్యూహం పక్కాగా వర్క్ వుట్ కావటంతో..  రానున్న సభలన్నీ ఇదే తీరులో ఉండాలన్న ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు.