Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్‌కు కుంప‌ట్లు త‌ప్ప మ‌రేం ప‌ట్ట‌వా?

By:  Tupaki Desk   |   18 Dec 2018 5:09 AM GMT
టీ కాంగ్రెస్‌కు కుంప‌ట్లు త‌ప్ప మ‌రేం ప‌ట్ట‌వా?
X
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా ఆదిప‌త్య పోరు స‌ద్దుమ‌ణ‌గ‌లేని ప్రచారం జ‌రుగుతోంది. శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ... కొత్తగా కొలువుదీరనున్న శాసనసభలో ఎవరిని సీఎల్పీ నేతగదా నియమిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అందులో నాలుగు సార్లు - మూడుసార్లు - రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారు. మరికొంత మంది మొదటిసారి విజయం సాధించిన నేతలు కూడా ఉన్నారు. గెలిచిన నేతల్లో సమర్థవంతమైన నేతలెవరన్న దానిపై అధిష్టానం దృష్టి సారించింది. ప్రతికూల పరిస్థితుల్లో శాసనసభలో సమర్థవంతంగా వాయిస్‌ వినిపించే నేత కోసం అధిష్టానం కూడా వేట మొదలుపెట్టింది. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైతే బెటర్‌ అనేదానిపై ఆరా తీస్తున్నది. ఇందుకు ఏకాభిప్రాయ మంత్రం జ‌పించ‌గా, కాంగ్రెస్ ఎల్పీ నేత ఎంపిక కోసం ఎంత ప్రయత్నించినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సోమవారం భేటీ కావాల్సిన సీఎల్పీ సమావేశం వాయిదా పడింది.

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలయ్యారనే విమర్శలు ఉన్నాయి. దీని నుంచి బయటపడేందుకు సమర్థవంతమైన నాయకుణ్ని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసేలా అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్‌, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో డిప్యూటీ స్పీకర్‌గా మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇద్దరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చట్టసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మానం చేయడంలో కీలకపాత్ర షోషించారు. దీంతోపాటు వారికి శాసనసభ వ్యవహారాలు, ప్రొసీడింగ్‌లు పై మంచి పట్టు కూడా ఉంది. ఈ నాలుగున్నరేళ్ల‌ కాలంలో అనేక అంశాలపై అధ్యయనం చేయడంతోపాటు స్థానికంగా ప్రజాసమస్యలపై కూడా అవగాహన ఉంది. వీరిలో ఎవరికి సీఎల్పీ నేతగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ వాయిస్‌ గట్టిగా వినిపిస్తారనే చర్చ జోరుగా నడుస్తున్నది. అధికార పార్టీని ప్రజా సమస్యలపై నిలదీయడంతోనూ వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరితోపాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ అధ్యక్షుడి గా కొనసాగుతుండటంతో ఆయనకు సీఎల్పీ నేతగా అవకాశం ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయినప్పటికీ ఆయన మాత్రం తనకే సీఎల్పీ కావాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. మాజీ ఎంపీ, మునుగోడు తాజా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎల్పీని కూడా ఆశిస్తున్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం తాజా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహిళా కోటాలో తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

మ‌రోవైపు కీల‌కమైన ఎస్టీ సామాజిక‌వ‌ర్గం నుంచి ఈ ద‌ఫా ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇంత‌ ప్రతికూల పరిస్థితుల్లోనూ హస్తం గుర్తుపై ఐదు మంది ఎస్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఆ సామాజిక తరగతికి చెందిన సీనియర్‌ నేత, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోడెం వీరయ్యకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని పార్టీ సీనియర్‌ నేత ఒకరు కోరుతున్నారు. సొంత నియోజకవర్గమైన ములుగు టికెట్‌ను ఆయనకు ఇవ్వకుండా 20 రోజుల ముందు భద్రాచలం టికెట్‌ను కేటాయించారు. అయినప్పటికి ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. గెలిచిన 19 ఎమ్మెల్యేల్లో ప్రతిపక్ష నేత కోసం ఐదు మంది ఎమ్మెల్యేలు క్యూలైన్లో ఉన్నారు. ఈ క్ర‌మంలో నిర్వ‌హించిన సమావేశం వాయిదా ప‌డ‌టంతో ఎల్పీ నేత‌పై అస్ప‌ష్ట‌త నెల‌కొంది. మళ్లీ సీఎల్పీ సమావేశం ఎప్పుడనేది తర్వాత ప్రకటించనున్నామ‌ని కాంగ్రెస్ పార్టీలోని ప‌రిస్థితికి నిద‌ర్శ‌నం అని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.