Begin typing your search above and press return to search.

మూకుమ్మ‌డి రాజీనామాలే...కాంగ్రెస్ కొత్త‌ అస్త్రం

By:  Tupaki Desk   |   13 March 2018 8:14 AM GMT
మూకుమ్మ‌డి రాజీనామాలే...కాంగ్రెస్ కొత్త‌ అస్త్రం
X
తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు రెండో రోజు మ‌రింత హాట్ హాట్‌ గా మారిపోయాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హెడ్‌ సెట్ విసిరారని దాంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ కన్నుకు దెబ్బ తగిలిందంటూ సరోజినీ ఐ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న శాసనసభలో జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. సభలో అనుచితంగా ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - సంపత్‌ కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. మిగతా కాంగ్రెస్ సభ్యులపై వేటు పడింది. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జానారెడ్డి - జీవన్‌ రెడ్డి - గీతారెడ్డి - చిన్నారెడ్డి - ఉత్తమ్ కుమార్‌ రెడ్డి - మాధవరెడ్డి - డీకే అరుణ - భట్టి విక్రమార్క - రామ్మోహన్‌ రెడ్డి - వంశీచంద్‌ రెడ్డి - పద్మావతిరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే, త‌మ ఎమ్మెల్యే సస్పెన్షన్ అలాగే సభ్యత్వాల రద్దుపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్‌ గా స్పందించింది. సీఎల్పీ నేత జానారెడ్డి అధ్యక్షతన సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చారు. సీఎల్పీ సమావేశంలో రాజీనామా నిర్ణయానికి మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే సీఎల్పీ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీకి పంపించారు. ఏఐసీసీ నుంచి అనుమతి రాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే 13 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది.