Begin typing your search above and press return to search.

టార్గెట్ కేసీఆర్‌.. తెలంగాణలో స్వ‌రం పెరిగింది

By:  Tupaki Desk   |   13 March 2018 2:10 PM GMT
టార్గెట్ కేసీఆర్‌.. తెలంగాణలో స్వ‌రం పెరిగింది
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత పార్టీని టార్గెట్ చేసేందుకు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలు వాడుతోంది. శాసనసభలో జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సభలో అనుచితంగా ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - సంపత్‌ కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. మిగతా కాంగ్రెస్ సభ్యులపై వేటు పడింది. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జానారెడ్డి - జీవన్‌ రెడ్డి - గీతారెడ్డి - చిన్నారెడ్డి - ఉత్తమ్ కుమార్‌ రెడ్డి - మాధవరెడ్డి - డీకే అరుణ - భట్టి విక్రమార్క - రామ్మోహన్‌ రెడ్డి - వంశీచంద్‌ రెడ్డి - పద్మావతిరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎపిసోడ్‌ ను ఆషామాషీగా వ‌దిలిపెట్ట‌వ‌ద్ద‌ని కాంగ్రెస్ సిద్ధ‌మైంది. ప‌లు రూపాల్లో పోరాటం చేయాల‌ని డిసైడ్ అయింది.

కోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేయ‌డం - ముఖ్య‌మంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం చేయ‌డంతో పాటుగా దీక్ష‌లు చేయాల‌ని డిసైడ్ అయింది. ఈ క్ర‌మంలో రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నాన్ని కాంగ్రెస్ నేత‌లు చేప‌ట్టారు. అనంత‌రం తమ శాసనసభ సభ్యత్వాల రద్దును నిరసిస్తూ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి - సంపత్ లు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వీరిరువురికీ మద్దతుగా నిలిచారు. రెండు రోజుల పాటు దీక్ష చేయనున్న వీరికి కాంగ్రెస్ మద్దతు పలికింది. వీరితో పాటు కాంగ్రెస్ - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు కూడా దీక్షకు కూర్చోనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట కాంగ్రెస్ చేపట్టనున్న ఈ దీక్షకు మద్దతుగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ కు చేరుకున్నారు.

ఈ దీక్ష సంద‌ర్భంగా పార్టీ నేత‌లు కేసీఆర్ తీరుపై మండిప‌డ్డారు. ప్రతిపక్షాన్ని తొక్కేసి… తన కుటుంబం బాగుపడాలన్నదే కేసీఆర్‌ తాపత్రయమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మండిప‌డ్డారు. అసెంబ్లిలో నిన్న జరిగిన ఘటన నాటకీయం - డ్రామా అని పేర్కొన్నారు. ఇటు కూర్చున్న వ్యక్తికి అటువైపు కన్నుకు ఎలా దెబ్బతగులుతుందని ప్రశ్నించారు. గతంలో హరీశ్‌ రావు సభా సాక్షిగా గవర్నర్‌ పై దాడికి యత్నించినా కాంగ్రెస్‌ సంయమనం పాటించిందన్నారు. అలాంటి వ్యక్తే ఇవాళ సభలో సభ్యత్వం రద్దును ప్రతిపాదించడం దారుణమన్నారు. ఎంపీ కవిత పార్లమెంటులో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయొచ్చు, అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులు నిరసన తెలపరాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి ఓ న్యాయం.. ప్రతిపక్ష నేతలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. నిండు సభలో పోలీసులతో మాపై దాడి చేయించారని ఉత్తమ్‌ ఆరోపించారు. మొత్తం ప్రధాన ప్రతిపక్షాన్ని సభ నుంచి సస్పెండ్‌ చేయడం దారుణమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ చెబితే… తాను వెళ్లి సరోజిని ఆస్పత్రిలో చేరానని స్వామిగౌడ్‌ స్వయంగా చెప్పారన్నారు. గతంలో హరీష్‌ రావు గవర్నర్‌ పై వ్యవహరించిన తీరు అందరికీ తెలుసన్నారు. స్పీకర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సిఎల్‌ పి నాయకుడు జానారెడ్డి అన్నారు. సభ తీసుకున్న నిర్ణయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిని - మండలిలో విపక్ష నేతను సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. ప్ర‌తిప‌క్ష సభ్యులందరినీ సస్పెండ్‌ చేయడం గర్హించదగిన చర్య అని ఆయన అన్నారు. నిన్న సభలో జరిగిన సంఘటన గవర్నర్‌ పరిధిలోనిదని ఆయన చెప్పారు. ఈ విషయంపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఈ ప్రభుత్వానికి అధికారం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయడం కేసీఆర్‌ సైకలాజికల్‌ గేమ్‌ అని టీ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ - సభ్యత్వ రద్దుపై ఆ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. రేపు హైకోర్టులో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.