వీరి వీరి గుమ్మడిపండు. కాంగ్రెస్ లో సీఎం ఎవరు.?

Mon May 14 2018 09:36:43 GMT+0530 (IST)

‘వెనుకటికి ఓ సామెత ఉంది.. ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అట..’ కాంగ్రెస్ లో పరిస్థితి ఇలాగే ఉందని టీఆర్ ఎస్ ముఖ్యులు గుసగుసలాడుకుంటున్నారు. ఎవ్వరేమనుకున్నా కానీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం మారడం లేదు. ఓవైపు కేసీఆర్  దేశం మొత్తం తనవైపు తిప్పుకునే పథకాలను రూపొందిస్తూ వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను నీరుగారుస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలతో లోపాయికారిగా టచ్ లో ఉంటూ ఆ పార్టీని దెబ్బ తీస్తున్నారు. కాంగ్రెస్ లోని చాలా మంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్ లో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికార టీఆర్ ఎస్ ఇంత పకడ్బందీగా ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ లో మాత్రం సీఎం కుర్చీ కోసం కొట్టుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం జానారెడ్డి.. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. మధ్యలో కోమటిరెడ్డి అండ్ కో.. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామే సీఎం అని ప్రకటించారు. ఈ ప్రకటనతో సీఎం అవుదామని ఆశపడ్డ రేవంత్ రెడ్డి షాక్ అయ్యారు.. పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయాల్సిన నేతలు ఇప్పుడు వస్తుందో రాదో తెలియని సీఎం కుర్చీ కోసం వాదులాడుకోవడం చూసి టీఆర్ ఎస్ నేతలు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు.*కుర్చీలాట..

ఎవ్వరేమన్నా సరే.. తెలంగాణలో  ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ను లీడ్ చేసే నేత లేడనడంలో ఎలాంటి సందేహం లేదు. జానారెడ్డి - ఉత్తమ్ కుమార్ రెడ్డి - కోమటిరెడ్డిలు గడిచిన 4 ఏళ్లుగా పార్టీపై తనదైన ముద్ర వేసింది లేదు.. తాజాగా కాంగ్రెస్ లోకి వచ్చిన ‘బాహుబలి’ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోని రాజకీయాలు తెలిసి బయటకే రావడం లేదు. సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానా అన్న ఆందోళన రేవంత్ లో నెలకొంది. చుక్కాని లేని నావలా ఉన్న కాంగ్రెస్ పార్టీని తనే లీడ్ చేసి అధికారంలోకి తీసుకొచ్చి సీఎం అవుదామని రేవంత్ ఎన్నో కలలు గన్నాడు. అయితే ముందుచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్న మేమేం సీఎంలు అని కోమటిరెడ్డి - ఉత్తమ్ - జానాలు రేవంత్ రెడ్డికి మోకాలడ్డుతున్నారు. అధికారంలోకి రాకుండానే కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ కుర్చీలాట తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

*వైఎస్ లాంటి నేత కావాలి..

కాంగ్రెస్ కు ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నేత కావాలి.. ఆయనలా పార్టీని నిలబెట్టి అందరినీ ఏకతాటిపైకి తీసుకురాగల నాయకుడు కావాలి. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేద్దామనుకున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోని ఉత్తమ్ - జానా - కోమటిరెడ్డిలు ప్రధాన ప్రత్యర్థులుగా మారారు. రేవంత్ రెడ్డి పార్టీలో చేరి ఇన్ని రోజులవుతున్నా ఆయనకు కాంగ్రెస్ లో పదవి రాకుండా చేస్తున్నది ఈ వర్గపోరే అన్నది ఇన్ సైడ్ టాక్.. ప్రస్తుతం కాంగ్రెస్ లో  ఆ పార్టీని లీడ్ చేసేందుకు పాత నేతలు ముందుకు రావడంలేదు. కొత్తగా వచ్చే నేతల్ని తొక్కేస్తున్నారు. అందుకే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా కాంగ్రెస్ లో పరిస్థితి తయారైంది.

* కాంగ్రెస్ సీఎం రేసులో ఎవరు ముందు.?

వచ్చే 2019 ఎన్నికల్లో గెలవాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి పోరాడాలి.  బలమైన కేసీఆర్ ను ఉమ్మడిగా ఎదుర్కోవాలి.. ఒకవేళ 2019లో గెలిస్తే సీఎం ఎవరనేది అప్పుడు అధిష్టానం తేలుస్తుంది. కానీ ఈ పనులన్నీ జరగకముందే తామే సీఎం అంటూ ప్రకటనలు ఇచ్చేస్తూ కాంగ్రెస్ లో వర్గపోరును ఇప్పటినుంచే పెంచి పోషిస్తున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నప్పుడే సీఎంగా ఫోకస్ అయ్యారు. ఆయనకు డబ్బు - పరపతి ఉన్నా ప్రజల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వన్ మ్యాన్ ఆర్మీ ఫోకస్ లేదు. సీనియర్ నేత జానారెడ్డి ఉన్నా ఆయనకు ప్రజల్లో ఆ పార్టీలో చరిష్మా లేదు. ఇక ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న కోమటిరెడ్డి సీఎం రేసులో ఉన్నా ఆయనను కాంగ్రెస్ లోనే పలువురు అడ్డుకుంటున్నారు. ఇక మొన్నీ మధ్యనే వచ్చిన రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ ను లీడ్ చేద్దామనుకుంటున్నా.. సీనియర్ నేతలు  అడ్డంకులు సృష్టిస్తున్నారు.

 ప్రస్తుతానికి కాంగ్రెస్ లో సీఎం రేసులో ప్రధాన పోటీదారులు ఉత్తమ్ - కోమటిరెడ్డి - రేవంత్ రెడ్డి.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి సీఎం అయ్యే అర్హతలున్నాయి. కానీ ముగ్గురూ అవుదామనుకోవడమే కాంగ్రెస్ కు తలనొప్పులు తెస్తోంది. అధికారంలోకి రాకముందే ఈ కుమ్ములాటలు ఆ పార్టీకి చేటుతెస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక కుర్చీ కోసం కొట్టుకుంటే బాగుంటుందనేది విశ్లేషకుల భావన.. చూద్దాం కాంగ్రెస్ లో మున్ముందు ఏం జరుగుతుందో..