Begin typing your search above and press return to search.

ఫాంహౌస్ సాక్షిగా కేసీఆర్ డీల్ ఫెయిలయింది

By:  Tupaki Desk   |   23 July 2017 5:35 AM GMT
ఫాంహౌస్ సాక్షిగా కేసీఆర్ డీల్ ఫెయిలయింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌ను తీవ్ర ఇర‌కాటంలో ప‌డేస్తున్న అంశానికి శుభం కార్డు ప‌డేయాల‌న్న ప్ర‌య‌త్నం విఫ‌ల‌మ‌యింది. త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన ఫాంహౌస్ వేదిక‌గా స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేస్తున్న ఇష్యూకు చెక్ పెట్టాల‌ని గులాబీ ద‌ళ‌ప‌తి భావించిన‌ప్ప‌టికీ ఆ ప్ర‌య‌త్నానికి రైతులు చెక్ పెట్టారు. ప్రాజెక్టు నిర్మాణం విష‌యంలో న్యాయమైన పరిహారం చెల్లించాలని 410 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ రైతులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి.

మల్లన్నసాగర్‌ లో మొత్తం 14 గ్రామాలు ముంపునకు గురవుతుండగా 13 గ్రామాల రైతు లు జీఓ 123 ప్రకారం తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించినప్పటికీ వేములఘాట్ రైతులు మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు. తమకు 2013 చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులతో, టీఆర్‌ ఎస్ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో సీఎం కెసిఆర్ స్వయంగా ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పోలీసు అధికారులతో గ్రామస్థులకు సమాచారం పంపించి తన ఫాంహౌస్‌ లో చర్చలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు. వేములఘాట్ నుంచి ఎర్రవెల్లి వెళ్లేందుకు వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు రైతులకు తెలిపారు. అయితే వేములఘాట్ రైతులు మాత్రం తమకు ప్రభుత్వం కల్పించిన రవాణా సదుపాయం అవసరం లేదంటూ తమ సొంత వాహనాల్లోనే ఫాంహౌస్‌ కు చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం వారు 12.30 గంటలకు ఫాంహౌస్‌ కు చేరుకోగా - 1.30 గంటల ప్రాంతంలో సీఎం రైతులతో చర్చలు ప్రారంభించారు. వారి మధ్య దాదాపు మూడున్నర గంటల పాటు చర్చలు జరిగాయి.

సిద్దిపేటతో పాటు నాలుగైదు జిల్లాల్లోని రైతులకు సాగు నీరందించే మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ ను నిర్మించి తీరుతామని - ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తామని ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదని సీఎం కేసీఆర్ రైతులకు స్ఫష్టంచేశారు. వీరిలో కొంతమంది రైతులు మాట్లాడుతూ పొరుగు మండలం ములుగులో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్‌ కు భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 12 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారని, తమ గ్రామంలో ఏటా రెండు పంటలు పండే భూములున్నాయని, కనీసం ఎకరాకు 20 లక్షలు ఇవ్వాలని సీఎంను కోరారు. దీనికి సిఎం స్పందిస్తూ ములుగు మండలం హెచ్‌ ఎండిఎ పరిధిలో ఉన్నందునే 12 లక్షలు ఇస్తున్నామని వేములఘాట్ గ్రామంలో ఉన్న భూములకు అంతరేటు ఇవ్వడం కుదరదని ఆయన రైతులకు తేల్చి చెప్పారు. ఎకరాకు ఆరు లక్షల రూపాయలకు మించి ఇవ్వడం కుదరదని, డబుల్ బెడ్‌ రూం ఇళ్లతో పాటు ఇతర పథకాలు ఏమైనా కావాలంటే ఇస్తామన్నారు. వేములఘాట్ గ్రామంలో సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండే భూములు ఉన్నాయన్నారు. ఈ విషయంలో స్పందించిన గ్రామస్థులు తమ గ్రామంలో గత 20 ఏళ్లుగా రెండు పంటలు పండించే భూములు కూడా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై పక్కనే ఉన్న రెవెన్యూ అధికారులతో సిఎం ఆరా తీయగా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం గత సంవత్సరం రెండు పంటలు పండే భూముల వివరాలు లేవని చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములఘాట్ గ్రామంలో రెండు పంటలు పండే భూములను నిర్ధారించడం కోసం కలెక్టర్ వెంకట్‌ రాంరెడ్డి - ఆర్‌ డిఒ ముత్యంరెడ్డిలతో పాటు గ్రామంలోని రైతులు కొంత మంది కలిసి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంకట్‌ రాంరెడ్డి ఆదివారం గ్రామానికి వచ్చి మీతో మాట్లాడతారని సీఎం కేసీఆర్ రైతులకు తెలిపారు. అయితే రైతులు మాత్రం ఆరు లక్షలకు ఎకరా భూమి ఇచ్చేందుకు అంగీకరించలేదు. గ్రామానికి చెందిన మహిళా రైతులతో మాట్లాడి చెబుతామన్నారు. తమకు నయాపైసా పరిహారం ఇవ్వకున్నా పరవాలేదు, అయితే మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద భూమికి భూమి ఇప్పించాలని రైతులు కోరగా, అలా ఇవ్వడం కూడా కుదరదని సిఎం స్పష్టం చేశారు.

కాగా, ఫాంహౌస్‌కు వచ్చిన రైతులకు భోజనాలు ఏర్పాటు చేసినప్పటికీ మెజార్టీ రైతులు భోజనం చేయలేదు. భోజనంపై అలిగితే ఎట్లనయ్యా మాట్లాడేది మాట్లాడుదాం భోజనం చేయండి అని సీఎం చెప్పినప్పటికీ తాము ఇంటి వద్దే భోజనం చేసి వచ్చామంటూ చాలా మంది రైతులు ఫాంహౌస్ నుంచి బయటకు వెళ్లారు. ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన అనంతరం ఫాంహౌస్ బయటకు వచ్చిన రైతులు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు తమకు తీవ్ర నిరాశకు గురిచేశాయన్నారు. సీఎం ఎకరాకు ఆరు లక్షల రూపాయలకు మించి పరిహారం ఇవ్వలేమని చెప్పడం అన్యాయమని అన్నారు. సీఎం చెప్పిన ధరకు తాము భూములను ఇస్తామని మాత్రం తాము చెప్పలేదని అన్నారు. తమ గ్రామంలో ఏటా రెండు పంటలు పండే సారవంతమైన భూములు ఉన్నాయని, మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద భూమికి భూమి ఇవ్వాలని కోరితే కూడా సీఎం అంగీకరించలేదని రైతులు పేర్కొన్నారు. ఎకరాకు ఆరు లక్షల రూపాయలతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్లు, స్వయం ఉపాధి కోసం గొర్రెలు ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా సాయం చేస్తామని సిఎం చెప్పినప్పటికీ, తాము అంగీకరించేది లేదని రైతులు స్ఫష్టం చేస్తున్నారు. కాగా, కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితులతో చర్చలు విఫలం కావడంతో అధికారులు, యంత్రాంగం తీవ్ర నిరాశకు గురైందని అంటున్నారు.