Begin typing your search above and press return to search.

అధిష్టానంపై తెలంగాణ బీజేపీ నేతల అసంతృప్తి

By:  Tupaki Desk   |   11 Jan 2019 2:30 PM GMT
అధిష్టానంపై తెలంగాణ బీజేపీ నేతల అసంతృప్తి
X
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా ఉంది తెలంగాణలో బీజేపీ పరిస్థితి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 6 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం మినహా ఎక్కడా విజయం సాధించలేదు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టిసారించారు. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో సభలు సమావేశాలు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు తెలంగాణలో పర్యటించారు. కానీ ఫలితం లేకపోయింది. గతంలో గెలిచిన ఆరు స్థానల్లో ఒక్కటి మినహా ఎక్కడా విజయం సాధించ లేకపోయింది. తాజా పరిణామాలు తెలంగాణ బీజేపీ నేతలను ఆందోళనకు గురి చేశాయి. ఇప్పటికీ కోలుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు.

బీజేపీలో పరిస్థితి చక్కబడక ముందే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. దీంతో పార్టీ నేతలు మరింత కలవరానికి గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన టీఆర్ ఎస్ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంది. కాంగ్రెస్ కూడా పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారతీయ జనతా పార్టీలో మాత్రం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన చర్చే జరగడం లేదని తెలిసింది. రాష్ట్ర నేతలు కూడా పంచాయతీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఒక వేళ అభ్యర్థులను బరిలోకి దింపినా గెలిచిన తర్వాత వారు పార్టీలోనే కొనసాగుతారనే గ్యారెంటీ లేకుండా పోయింది.

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడం అనవసరపు ఖర్చుగా భావిస్తున్న రాష్ట్ర నేతలు పార్లమెంట్ ఎన్నికలను కూడా లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికలపై ఉత్సాహం ఉంటే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేవారనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల ఖర్చు అనుకునేకంటే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మల్చుకోవాలని భావిస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అనుసరించే వైఖరి ఏంటనేది అగ్ర నాయకత్వమే స్పష్టం చేయాల్సి ఉంది.