కొలువుదీరనున్న తెలంగాణ అసెంబ్లీ

Wed Jan 16 2019 15:23:34 GMT+0530 (IST)

ప్రతిపక్షాలే లక్ష్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుట ఎగురవేసింది. అదే స్పీడ్ లో శాసనసభను ఏర్పాటు చేయలేకపోయింది. మంత్రి వర్గ ఏర్పాటుపై కూడా కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ శాసన సభ కొలువుదీరబోతోంది. గురువారం అసెంబ్లీ కళకళలాడబోతోంది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్తవారికి పాతవారికి  శాసన సభ స్వాగతం పలకబోతోంది. కేసీఆర్ అనుకున్నట్లుగానే ప్రభుత్వ విధానాలను విమర్శించే ప్రతిపక్షం ఈసారి బలహీనంగా ఉంది.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ రెండోసారి కొలువుదీరనుంది. డిసెంబరు 11వ తేదీనే ఎన్నికల ఫలితాలు వెలువడినా అనేక కారణాలతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు  గురువారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అనంతరం స్పీకర్ ఎన్నిక గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో ముగుస్తుంది.

పాతవారితోపాటు కొత్తవారు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. సభలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 119. ఒకరు ఆంగ్లో ఇండియన్ సభ్యుడు ఉంటారు. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 120 అవుతుంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల చేరికతో టీఆర్ఎస్ 90 కాంగ్రెస్ 19 ఎంఐఎం 7 టీడీపీ 2 బీజేపీ తరఫున ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇప్పటికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ ఉప సభాపతితోపాటు కీలక పదవులు నిర్వహించిన అనుభవం ఉంది. 1985 నుంచి పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 23 మంది ఎమ్మెల్యేలు తొలిసారి శాసన సభలో అడుగుపెట్టబోతున్నారు. 76 మంది గత అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు. వీరిలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేలుగా ముంతాజ్ ఖాన్ ఎర్రబెల్లి దయాకర్ రావు రెడ్యానాయక్ ఉన్నారు. పార్లమెంట్ సభ్యులుగా రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన బాల్కసుమన్ మల్లారెడ్డి కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.

* పదవులు వరించేది ఎవరిని..?

అసెంబ్లీ కొలువుదీతుండడంతో మంత్రి పదవులు ఆశించేవారిలో ఉత్కంఠ మొదలైంది. పదవులు ఎవరిని వరిస్తాయనేది ప్రధానంగా చర్చకు దారితీయనుంది. మరోవైపు ఎమ్మెల్సీలుగా ఉన్న మైనంపల్లి హన్మంత్ రావు నరేందర్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ గా  ముంతాజ్ గురువారం సభలో సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.  అసెంబ్లీలో కేసీఆర్ తోపాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మొదలుకానుంది.