నో వే.. ఉత్తమ్ కిస్తే మాకివ్వాల్సిందే..

Wed Sep 26 2018 13:51:35 GMT+0530 (IST)

కాంగ్రెస్ లో ఇప్పుడు సీట్ల గోల పీక్ స్టేజ్ కి చేరింది. సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ తమతోపాటు తమ వారసుల్లో ఒకరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని భీష్మించుకు కూర్చుంటున్నారట.. అంతేకాదు ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమేనని స్పష్టం చేశారు. దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని కోరారు. కానీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు మాత్రం ఇందులోంచి మినహాయింపు దక్కింది. ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి.. ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి టికెట్లు పొంది గెలిచారు. ఇప్పుడు సిట్టింగ్ లు కావడంతో వారికి సీట్లు కన్ఫమని తేలింది. మరి మా పరిస్థితి ఏంటని ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లంతా ప్రశ్నిస్తున్నారట.. ఉత్తమ్ ను బూచీగా చూపి తమకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట..

*తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన కుమారుడు రఘువీరా రెడ్డికి టికెట్ కోసం ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారు.. తనకు నాగార్జున సాగర్. - కుమారుడికి మిర్యాల గూడ కోసం పట్టుబడుతున్నారట..

* ఉమ్మడి ఏపీలో హోంమంత్రిగా చేసిన సబితా ఇంద్రారెడ్డి ఈసారి కాంగ్రెస్ ను రెండు సీట్లు కోరుతున్నారట.. తనకు మహాశ్వరం.. తన కుమారుడు కార్తీక్ రెడ్డికి రాజేంద్రనగర్ సీట్లు అడుగుతున్నారట..

* డీకే అరుణ కూడా ఉత్తమ్ వలే తనకూ రెండు టికెట్లు కావాలని లొల్లి చేస్తున్నారట.. తనకు సిట్టింగ్ స్థానం గద్వాలతోపాటు తన కుమార్తె స్నిగ్ధా రెడ్డికి మక్తల్ టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారట..

*మరో సీనియర్ నేత గీతారెడ్డి ఈసారి తన కుమార్తె మేఘనారెడ్డిని ఈసారి అసెంబ్లీ బరిలో దించేందుకు రెడీ అయ్యింది. ఆమెకు తన జహీరా బాద్ టికెట్ ఇచ్చి తనకు వేరే సీటు ఇవ్వాలని కోరుతున్నారట.. లేకపోతే ఎంపీగానైనా పోటీచేస్తానని గీతారెడ్డి చెబుతున్నారు.

*పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క.. తన సోదరుడు మల్లు రవిని ఈసారి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నారట.. వీరికి రెండు సీట్లు కావాలని అడుగుతున్నారు.

*ఇక మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా తనతోపాటు తన కుమార్తెల్లో ఒక్కరికి కాంగ్రెస్ టికెట్ కావాలని కోరుతున్నారట..

ఇలా పీసీసీ చీఫ్ ఉత్తమ్ మొదలుపెట్టిన ఫ్యామిలీ ప్యాక్ సీట్ల కోసం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా డిమాండ్ చేస్తుండడంతో కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఇస్తే ఓ బాధ.. ఇవ్వకపోతే పార్టీ లో అసమ్మతి పెరుగుతుందని ఖంగారు పడుతోందట..