Begin typing your search above and press return to search.

ఈసీ దొరికింది...తేజస్వీ ఆటాడేసుకున్నారు

By:  Tupaki Desk   |   22 May 2019 4:43 PM GMT
ఈసీ దొరికింది...తేజస్వీ ఆటాడేసుకున్నారు
X
తేజస్వీ యాదవ్... ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడిగానే కాకుండా... ఎంట్రీ ఇచ్చిన తొలిసారే ఏకంగా బీహార్ డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్న నేతగా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే. అయితే తేజస్వీ డిప్యూటీ సీఎం పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. లాలూ చేరికతోనే బీహార్ ముచ్చటగా మూడో సారి అధికారం చేజిక్కించుకున్న జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్... ఆ తర్వాత అవినీతి ఆరోపణలను బూచిగా చూపి తేజస్వీతో పాటు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను కూడా తన కేబినెట్ నుంచి బయటకు పంపేశారు.

అయితే అధికారంలో ఉన్నా... విపక్షంలో ఉన్నా లాలూతో పాటు ఆయన తనయులు తమదైన శైలిని చూపించడంలో దిట్టలనే నిరూపించున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీకి తొత్తుగా మారిందంటూ ఈసీపై విపక్షాలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలన్నింటినీ ఈసీ లైట్ గానే తీసుకుని సాగిపోతోంది. అయితే ఇప్పుడు తేజస్వీ సంధించిన ప్రశ్నకు మాత్రం ఈసీ స్పందించక తప్పని పరిస్థితిలో పడిపోయింది. అయినా ఏం జరిగిందంటే... ఎన్నికల పోలింగ్ ముగిసి కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు సిద్దమైపోతున్న వేళ... ఓట్లు నిక్షిప్తమైన ఓ ఈవీఎంను కౌంటింగ్ కేంద్రానికి తరలించేందుకు బాల కార్మికుడిని ఈసీ వినియోగించింది. ఈవీఎంలను నెత్తిన పెట్టుకుని వెళుతున్న బాల కార్మికుల ఫొటోలు విడుదలైపోయాయి.

ఇంకేముంది... తేజస్వీ ఎంట్రీ ఇచ్చేశారు. తమ మాట వినడం లేదని ఇప్పటికే ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తేజస్వీ... ఈసీని ఓ ఆటాడేసుకున్నారని చెప్పక తప్పదు. ఈవీఎంలను తరలించేందుకు బాల కార్మికులను ఎలా వినియోగిస్తారని ప్రశ్నించిన తేజస్వీ... సదరు ఈవీఎంలను తరలించేందుకు ఏకంగా రిజిస్ట్రేషన్ లేని వాహనాలను కూడా ఈసీ వినియోగించిందంటూ తనదైన శైలి ఆరోపణలు గుప్పించారు. ఇదివరలో తేజస్వీ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పని ఈసీ... ఈ దఫా మాత్రం ఆయన ప్రశ్నలకు మాత్రం స్పందించక తప్పని సరిస్థితి నెలకొందని చెప్పాలి. ఎంతైనా లాలూ కుమారుడు కదా... అవకాశం దొరికితే తేజస్వీ ఎందుకు వదిలిపెడతారు?