ప్రాణభయంలో సీఎం..పక్కింటాయనపై నిఘా

Thu Nov 15 2018 19:48:46 GMT+0530 (IST)

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ సహా ఆయన కుటుంబం వార్తల్లోకి రాకపోతే వింత అన్నట్లుగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఓవైపు కోడలి పంచాయతీ  కుటుంబం వార్తల్లో నిలుస్తుంటే...మరోవైపు తాజాగా లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వీ యాదవ్ ఇంకో కామెంట్ చేశారు. ఒకప్పటి డిప్యూటీ అయిన సీఎం తేజస్వీ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఆరోపణలు చేశారు. బీహార్ సీఎం తనపై నిఘా పెట్టారని వాపోతున్నారు. ``నా పక్కింటాయన నామీద నిఘా పెట్టాడు..కావాలంటే చూడండి ఆయన ఇంటిచుట్టూ ఉన్న సీసీటీవీ కెమేరాలు అన్ని మా ఇంటివైపే వీడియో తీస్తున్నాయి...’’ అంటూ ఈ విషయంపై పదే పదే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సీఎంపై విరుచుకుపడుతున్నాడు. ఇంతకూ ఆ పక్కింటాయన ఎవరంటే..బీహార్ సీఎం.తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఆయనకు 5 సర్కులర్ రోడ్ లో బంగళాను కేటాయించారు. ఆ తర్వాత మహాకూటమి నుంచి నితీష్ కుమార్ తప్పుకొని బీజేపీ మద్ధతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకున్నారు. ఆ బంగళా ఖాళీ చేయమని ఎన్నిసార్లు అధికారులు చెప్పినా ఆయన ఖాళీ చేయలేదు. ఓ వైపు ఈ అంశం వార్త లో నిలుస్తుండగా...పక్క పక్కనే ఇద్దరి బంగళాలు ఉండటంతో విమర్శలు గుప్పిస్తూ తాజాగా  తేజస్వీ యాదవ్ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. తన ట్విట్టర్ పోస్టులో కొన్ని ఫొటోలను సైతం జతచేస్తూ సీఎం నితీష్ పై ఆరోపణలు గుప్పిస్తున్నాడు. తేజస్వీ యాదవ్ ట్విట్టర్ లో తాజాగా సంచలన విషయాలు పోస్ట్ చేశారు. ‘‘నితీష్ కు అభద్రతాభావం పెరిగిపోతోంది. ఆయనను మృత్యుభయం వెంటాడుతోంది. చిరాకులు అపోహలతో అలమటిస్తూ సీసీటీవీ కెమేరాలు ఆయన/నా ప్రహరీగోడ చుట్టూ పెట్టించుకొని నా మీద నిఘా పెంచారు. అసలు ముఖ్యమంత్రికి కెమేరాలు ఎందుకు? ఆయన భవంతి చుట్టూ కట్టుదిట్టమైన పోలీసు చెక్‌పోస్టులు - భద్రతా సిబ్బంది ఉండగా..’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో ఉంటున్న తేజస్వీ యాదవ్ దాన్ని ఖాళీ చేయకుండా ఇలా విమర్శలు చేయడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.