రేప్ చేసి... వీడియోను నెట్ లో పెట్టి!

Wed Sep 13 2017 13:46:59 GMT+0530 (IST)

ఆడపిల్లలకు రక్షణ కరవవుతోంది. ప్రాంతమేదైనా మహిళల భద్రత గాలిలో దీపంలా మారింది. తాజా పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. మానవ సంబంధాలనే మంటగలుపుతూ దేశంలో ఏదో మూల రోజూ వెలుగుచూస్తున్న ఘటనలతో మహిళలు ఒంటరిగా బయట అడుగుపెట్టాలంటేనే భయపడుతున్నారు. చాలా ఉదంతాల్లో తెలిసిన వారు బంధువులే నిందితులుగా ఉంటుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.తాజాగా  సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై లైంగికదాడికి పాల్పడి ఆ దృశ్యాలను అశ్లీల వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన సహచరుడిని బెంగళూరు వివేకనగర పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన అరింధమ్ నాథ్ అనే యువకుడు బెంగళూరులో ఒక సంస్థలో ఐటీ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఇదే కంపెనీలో పనిచేసే యువతిని ప్రేమించాలని కొంతకాలంగా వేధిస్తున్నా ఆమె నిరాకరించింది. గత ఏడాది ఒకరోజు తన ఇంటికి రావాలని అరింధమ్ నాథ్ యువతిని కోరగా ఆమె తన స్నేహితురాలిని వెంట తీసుకుని అతడి ఇంటికి వెళ్లింది.

ఈ సమయంలో అరింధమ్ నాథ్ - ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను రహస్యంగా మొబైల్ ఫోన్ లో వీడియో తీశాడు. కొంతకాలానికి ఆమె వేరే కంపెనీలో చేరింది. అప్పటి నుంచి ఆ కామాంధుడు ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఆమెకు పదేపదే ఫోన్ చేసి తన ఇంటికి రావాలని వేధించడం ప్రారంభించాడు. అంతే కాకుండా తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకపోతే రేప్ వీడియో ఇంటర్నెట్ లో పెడతానని బెదిరింపులకు దిగాడు. అయితే అరింధమ్ నాథ్ బెదిరింపులను బాధితురాలు లైట్ తీసుకుంది. దీంతో రెచ్చిపోయిన దుర్మార్గుడు ఈ నెల 4 తేదీన అత్యాచార దృశ్యాలను ఓ పోర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ లింక్ ను బాధితురాలికి పంపించాడు.

దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయగా - స్నేహితురాలు ఆమెను కాపాడింది. ఆమె సహకారంతో ఈ నెల 6వ తేదీన వివేకనగర పీఎస్ లో నిందితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం అరింధమ్ నాథ్ ను అరెస్ట్ చేశారు. అత్యాచారం - బెదిరింపులు - ఐటీ చట్టం తదితర సెక‌్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు.