Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ కారు యాక్సిడెంట్ కాదా?

By:  Tupaki Desk   |   4 May 2016 5:04 AM GMT
జూబ్లీహిల్స్ కారు యాక్సిడెంట్ కాదా?
X
జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఈ నెల 1(ఆదివారం)న ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దీన్లో ప్రముఖ బిల్డర్ కట్కూరి నిరంజన్ రెడ్డి కుమార్తె.. 21 ఏళ్ల కట్కూరి దేవి మరణించింది. ఈ మృతి మీద ఆమె కుటుంబ సభ్యులు పలు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒక ప్రత్యక్ష సాక్షి చెబుతున్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాము అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర విషయాలు చెప్పటం.. ఈ అంశాల మీద పోలీసులు ఇప్పటివరకూ ఫోకస్ చేయకపోవటం పలు సందేహాలకు గురి చేస్తోంది.

ఆదివారం తెల్లవారుజామున తాను కార్లు కడగటానికి బయటకు వచ్చానని.. అప్పటికి వీధి చివరన ఒక కారు ఆగి ఉందని వెల్లడించాడు. కారులో నుంచి తలుపు కొడుతున్న శబ్దాలు వినిపించాయని.. చీకటిగా ఉండటంతో అక్కడికి వెళ్లలేదని చెప్పాడు. కాసేపటికే కారులో నుంచి దిగిన ఒక యువతి అరుస్తూ పరిగెత్తే ప్రయత్నం చేయగా.. ఆమెను ఒక యువకుడు వెంబడించి కారులోకి బలవంతంగా తోసేసినట్లుగా చెప్పాడు. అరగంట పాటు కారులోనే వారు ఉన్నారని.. హెల్ప్.. హెల్ప్ అంటూ అరుస్తూ ఆ యువతి ఉందని.. సాయం చేసేందుకు తాను పక్కనే ఉన్న ఇంటి కాలింగ్ బెల్ నొక్కితే అది పని చేయలేదని చెప్పాడు.

కారులో వారిద్దరు కాకుండా ఇంకొకరు కూడా ఉండొచ్చని.. ఉదయం 4.30 గంటల ప్రాంతంలో కారు వేగంగా దూసుకెళ్లిందని చెప్పాడు. ఇది జరిగిన పావు గంట తర్వాత పాలు పోసే వ్యక్తి వచ్చి.. కారు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారని.. తాను వెళ్లి చూస్తే.. మొదట వీధి చివరన ఆగి ఉన్న కారే.. ప్రమాదినిక గురైన కారుగా రాము వెల్లడించాడు. రాము చెబుతున్న మాటల ప్రకారం కారులో మృతి చెందిన దేవిది హత్యగా ఆమె పెద్దనాన్న వాదిస్తున్నారు.

తాము ప్రమాద స్థలానికి వెళ్లే సరికి దేవి స్నేహితుడు సామ భరతసింహారెడ్డి తల్లిదండ్రులు అక్కడే ఉన్నారని.. పోలీసులు..డాక్టర్లను మేనేజ్ చేసినట్లుగా ఆరోపించారు. సన్నగా ఉన్న చెట్టును ఢీ కొన్న కారులో ఉన్నోళ్లు మరణిస్తే.. కారు ఢీ కొట్టిన సన్నటి చెట్టు మాత్రం ఎందుకు విరగలేదని ప్రశ్నిస్తున్న వైనం పలు సందేహాలకు తావిచ్చేలా ఉంది. ఈ ఉదంతంపై ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్న రాము.. బాధితురాలి తరఫు బంధువుల మాటలు పోలీసుల వైపు వేలెత్తేలా ఉన్నాయనటంలో సందేహం లేదు. ఈ విషయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది.