స్వలింగ సంపర్కం ఎఫెక్ట్..ఫ్రాన్స్ స్కూళ్లలో కొత్త విధానం

Tue Feb 19 2019 08:00:01 GMT+0530 (IST)

ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలాదేశాల్లో స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. దీంతో ఇలాంటి ఆడ-ఆడ - మగ-మగ జంటలు పిల్లలను దత్తత తీసుకోవడమో - సరోగసీ ద్వారా కనడమో చేస్తున్నారు. ఫ్రాన్స్ లో ఇలా స్వలింగ జంటల పిల్లలు స్కూళ్లలో ఎక్కువవుతున్నారు. దీంతో స్కూళ్ల రికార్డుల్లో తల్లిదండ్రుల పేర్లు రాసేటప్పుడు గందరగోళం ఏర్పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఫ్రాన్స్ కొత్త ఆలోచన చేసింది. స్కూళ్లలో పిల్లల రికార్డుల్లో అమ్మ - నాన్న అనే కాలమ్స్ తీసేసింది.
   
పిల్లల వ్యక్తిగత వివరాలు నమోదు చేసేటప్పుడు అమ్మ - నాన్నలకు బదులు పేరెంట్ 1 - పేరెంట్ 2 అని రాయాలని నిర్ణయించారు. దీన్ని చట్టరూపంలో కూడా తీసుకొచ్చారు. సో.. ఇక ఫ్రాన్స్ బడుల్లో పిల్లలకు తల్లిదండ్రులన్న కాన్సెప్ట్ పోయి పేరెంట్ 1 - 2 అన్న నంబర్లు మొదలవుతాయన్నమాట.
   
అనేక యూరప్ దేశాలు - అమెరికా - పలు ఇతర దేశాల్లో కూడా స్వలింగ జంటల మధ్య వివాహాలు జరుగుతుండడంతో ఆయా దేశాలు కూడా ఫ్రాన్స్‌ను స్ఫూర్తిగా తీసుకుంటాయేమో చూడాలి.
   
గే సెక్స్ ను - గే మ్యారేజెస్ ను సమర్థించేవారు ఇలాంటి కొత్త పద్ధతులను సమర్థిస్తున్నా మరికొందరు మాత్రం ఎలాంటి పరిస్థితులు వచ్చాయీ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్వలింగ సంపర్కాల పెడధోరణి దానికి చట్టబద్ధత కల్పించడం అన్నది మొదలుపెడితే కొన్నాళ్లకు ప్రపంచంలో ఆడామగా అంతరించిపోయి తృతీయ వర్గ ప్రపంచమే మిగులుతుందంటూ విమర్శలు చేసేవారూ ఉన్నారు.