Begin typing your search above and press return to search.

ఏపీలో 12వేల మంది పరీక్ష రాస్తే.. 12 మందే పాస్ అయ్యారు

By:  Tupaki Desk   |   15 Sep 2019 7:42 AM GMT
ఏపీలో 12వేల మంది పరీక్ష రాస్తే.. 12 మందే పాస్ అయ్యారు
X
పరీక్ష ఏదైనా కానీ 12 వేల మంది రాశారనుకుందాం. ఎంత మంది పాస్ అవుతారు? తక్కువలో తక్కువ 60 శాతానికి తక్కువ పాస్ అయ్యే ముచ్చటే ఉండదు. ఒకవేళ పరీక్ష రాసింది పాఠాలు చెప్పే టీచర్లు అయితే ఫలితం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న వేస్తే.. బోలెడంతమంది పాస్ పక్కా అనేస్తారు ఎవరైనా. కానీ.. తాజాగా ఏపీలో విడుదలైన పరీక్షా ఫలితాలు చూస్తే.. ఎగ్జామ్స్ రాసిన టీచర్ల కళ్లల్లో రక్తకన్నీరు కారుతోంది.

ఎందుకంటే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం 12 వేల మంది టీచర్లు పరీక్ష రాస్తే.. చిత్రంగా పాస్ అయ్యింది కేవలం పన్నెండు మంది మాత్రమేనట. ఈ విచిత్రం ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న శాఖాపరమైన పరీక్షల్లో చోటు చేసుకుంది. ఎందుకిలా? టీచర్లు మరీ అంత పూర్ గా ఉన్నారంటే కాదనే చెప్పాలి. పరీక్షను నిర్వహిస్తున్న తీరుతోనే ఇలాంటి పరిస్థితి ఉందట.

ఇప్పటివరకూ నెగిటివ్ మార్కింగ్ విధానం లేకుంటే కొత్తగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో.. ఈ ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. విద్యాశాఖకు చెందిన ఏపీపీఎస్సీ ఈ ఏడాది జూన్ 15న గెజిటెడ్ ఆఫీసర్స్ టెస్ట్ ఫలితాలు సంచలనంగా మారాయి. ఏపీ మొత్తంగా 15 వేలమంది ఎస్జీటీ.. ఎస్ఏ టీచర్లు పరీక్షలు రాస్తే.. కేవలం 12 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించటంతో అవాక్కు కావటం పరీక్షలు రాసిన టీచర్ల వంతైంది.

ఇంతకీ ఈ పరీక్ష ఎందుకంటే.. సీనియరిటీ ఉన్న వారు ప్రమోషన్ కోసంగా చెప్పాలి. 24 ఏళ్ల స్కేలు పొందటానికి సెకండరీ గ్రేడ్ టీచర్లు.. 12 ఏళ్ల స్కేల్ కోసం స్కూల్ అసిస్టెంట్లు.. హెడ్మాస్టర్లుగా ప్రమోషన్ కోసం 50 ఏళ్ల లోపు ఉన్న స్కూల్ అసిస్టెంట్లు డిపార్ట్ మెంటల్ టెస్టులకు హాజరు కావాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రమోషన్లు.. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితికి అవకాశం ఉంటుంది. అయితే.. పరీక్షల్లో అమలు చేస్తున్న నెగిటివ్ మార్కింగ్ విధానంతో దారుణమైన రిజల్ట్ వచ్చిందని చెబుతున్నారు.