తండ్రి లేని ఫస్ట్ పాపగా రికార్డుల్లోకి..!

Sun May 20 2018 17:04:25 GMT+0530 (IST)

పిల్లలకు తల్లి ఎలానో.. తండ్రి కూడా అంతే. కానీ.. తండ్రి పేరు అన్నది లేకుండా రికార్డుల్లో నమోదు చేయటం ఉండదు. గడిచిన కొంతకాలంగా న్యాయపోరాటం చేసిన ఒక యువతి చివరకు తాను అనుకున్నది సాధించారు. తండ్రి లేని పాపగా రికార్డుల్లో నమోదు చేసి.. అలా చేసిన మొదటి పాపగా తావిషి పెరారా రికార్డు సృష్టించింది. ఇంతకూ తండ్రి లేకుండా పాప పేరు రికార్డుల్లో ఎలా సాధ్యమన్న విషయంలోకి వెళితే..త్రిచీకి చెందిన మధుమిత అనే మహిళ.. తన భర్త చరణ్ తో విభేదాల కారణంగా విడిపోయారు. వీరిద్దరూ పరస్పర  అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. కొన్ని రోజుల అనంతరం వీర్యదాతతో ఆమె తల్లి అయి.. ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా త్రిచీ అధికారులు బిడ్డ తండ్రిపేరును వీర్యదాత మనిష్ పేరును బర్త్ సర్టిఫికేట్‌లో పేర్కొన్నారు.

దీనిపై మధుమిత అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్టిఫికేట్ నుంచి తండ్రి పేరును తొలగించాలని ఆమె కోరారు. అయితే.. అందుకు రూల్స్ ఒప్పుకోవని అధికారులు స్పష్టం చేయటంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. గత ఏడాది సెప్టెంబరులో ఆమె మద్రాసు హైకోర్టును న్యాయం చేయమని కోరారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. బర్త్ సర్టిఫికేట్ ను సరి చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆమె దరఖాస్తును అధికారులు మరోసారి రిజెక్ట్ చేయటంతో ఆమె మరోసారి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

ఈసారి విడాకులు తీసుకున్న భర్త చరణ్ రాజ్.. వీర్యదాత మనీష్ లు ఇద్దరూ సదరు బిడ్డకు తాము తండ్రులం కాదని అఫిడవిట్ లు ఇచ్చారు. దీంతో.. మధుమిత అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. తావిషి పెరేరా బర్త్ సర్టిఫికేట్ లో తండ్రి కాలమ్‌ను ఖాళీగా వదిలేశారు. ఈ తరహాలో తండ్రి పేరు కాలమ్ లో ఖాళీగా ఉంచిన మొదటి చిన్నారిగా తావిషి అరుదైన రికార్డుల్లోకి ఎక్కింది.