Begin typing your search above and press return to search.

అమెరికాలో కుల పిచ్చి..ఆ ప్ర‌ముఖుడి నిప్పులు

By:  Tupaki Desk   |   11 May 2017 9:38 AM GMT
అమెరికాలో కుల పిచ్చి..ఆ ప్ర‌ముఖుడి నిప్పులు
X
వ‌ల‌స రాజ్యంగా పేరొందిన‌ అవ‌కాశాలు అందించడంలో అగ్ర‌స్థానంలో ఉన్న అమెరికా గురించిన రెండో కోణం బ‌హిర్గ‌త‌మైంది. ప్ర‌స్తుతం అమెరికాలో కొంద‌రు చేస్తున్న కుల రాజ‌కీయాల గురించి, అక్క‌డ తారాస్థాయికి చేరిన ఈ భావ‌న గురించి తెలుగు చ‌ల‌న‌చిత్ర రంగ ప్రముఖులు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము చ‌ద‌వుకునే రోజుల్లో అమెరికా వెళ్లడమంటే చాలా క‌ష్టమ‌ని, అయినా ఎన్నో క‌ష్టనష్టాల కోర్చి అయిన వారిని వ‌దిలి అమెరికా దాకా వెళ్లి క‌ష్టప‌డే వాళ్ల‌మ‌ని గుర్తుచేశారు. అందుకు ప్రవాస ఆంధ్రుడంటే చాలా గౌర‌వ‌ముండేద‌ని తెలిపారు. అప్పట్లో అమెరికాలో ఉండే తెలుగువారంతా ఒక కుటుంబంలా మెలిగేవారని త‌న అనుభ‌వాల‌ను త‌మ్మారెడ్డి వెళ్లడించారు.

అయితే అమెరికాలో కుల‌గ‌జ్జి ఇప్పుడు బాగా పెరిగిపోయింద‌ని తమ్మారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొద్దికాలంగా అమెరికా వెళ్లడం అన‌కాప‌ల్లి వెళ్లినంత తేలిక కావ‌డంతో ప‌నికిమాలిన బ్యాచ్ అంతా అమెరికాలో త‌యారై చివ‌ర‌కు ప్రవాస ఆంధ్రుడు అంటే అస‌హ్యించుకునే స్థితికి తెచ్చేశారని భ‌ర‌ధ్వాజ విమ‌ర్శించారు. ఇందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయ‌ని ఆయ‌న విశ్లేషించారు. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌, సామాజిక బాధ్య‌త‌...రెండింటినీ స‌మానంగా చూసే అమెరికాలో కొన్నాళ్లుగా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని వ్యాఖ్యానించారు. రాజకీయ కంపు, సినిమా కంపు, కుల‌గ‌జ్జితో అమెరికాలో కూడా ద‌రిద్రం ప‌ట్టిస్తున్నారు అంటూ మండిప‌డ్డారు. రాజ‌కీయ నాయ‌కుల‌కు ర్యాలీలు, పార్టీ జెండాలు ఎగ‌రేయ‌డం, అభిమాన హీరోల ర్యాలీలు- జ‌య‌జ‌య ధ్వానాలు తీవ్ర ఇబ్బందిగా పుట్టిస్తున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కుల రాజ‌కీయాలు చేస్తూ కుళ్లు కంపు కొట్టిస్తున్నారని త‌మ్మారెడ్డి మండిప‌డ్డారు.

కాగా, అమెరికాలోని కొంద‌రు ప్ర‌వాసులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. తాజాగా సాగుతున్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌ట‌న ఇందుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. బాబు టూర్ ఏపీ ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న అనే కంటే... ఒక సామాజిక‌వ‌ర్గం వారి కార్య‌క్ర‌మం అన్న‌ట్లుగా మారిపోయింద‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక‌ట్రెండు సంఘాల వారు మాత్ర‌మే చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు హాజ‌రు అవుతుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు. అమెరికాలో ఇప్ప‌టికే నెల‌కొని ఉన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో అంతా క‌లిసిక‌ట్టుగా ఉండ‌కుండా కుల పిచ్చితో ముందుకు సాగితే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని అంటున్నారు