తమిళనాట... కుర్చీలాట మొదలైనట్టేనా?

Mon Apr 15 2019 20:37:20 GMT+0530 (IST)

ఓ వైపు సార్వత్రిక ఎన్నికల హీట్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే తొలి దశ పోలింగ్ ముగియగా... రెండో విడత పోలింగ్ కు రంగం సిద్ధమవుతోంది. రెండో విడత పోలింగ్ లో తమిళనాడు రాష్ట్రంలోని మొత్తం 40 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగిసిపోవడంతో మూడు రోజుల్లో జరగనున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అదే సమయంలో 40 ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు తమిళనాడులోని ప్రధాన పార్టీలు అన్నాడీఎంకే - డీఎంకేలతో పాలు పలు పార్టీలు కూడా తమదైన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల కంటే కూడా 40 ఎంపీ సీట్లకు జరగనున్న ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ సీట్లపైనే అక్కడి పార్టీలు కీలకంగా భావిస్తున్నాయట.అసలు ఈ ఉప ఎన్నికలను బై పోల్స్ గా కాకుండా... ఏకంగా ఎడప్పాడి పళని సామి సర్కారు భవిష్యత్తును తేల్చే ఎన్నికలుగానే అక్కడి పార్టీలు భావిస్తున్నాయట. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక..  ఎడప్పాడి సర్కారు పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అంతేకాదండోయ్... ఏకంగా అన్నాడీఎంకే సర్కారు కూలిపోయి... డీఎంకే సర్కారు గద్దెనెక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతటి కీలక పరిణామాలకు కారణమవుతున్నందుననే... సార్వత్రిక ఎన్నికల కంటే కూడా ఉప ఎన్నికలపైనే తమిళ పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయట.

అయినా ఉప ఎన్నికలే అంతటి కీలక పరిణామాలకు ఎలా కారణమవుతున్నాయన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించిన తర్వాత ఆమె నమ్మిన బంటు ఓ పన్నీర్ సెల్వం సీఎంగా ప్రమాణం చేసినా... ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోయిన సంగతి తెలిసిందే. జయ మరణంతో రాజకీయ శూన్యం ఆవరించిన తమిళనాడుపై కన్నేసిన బీజేపీ... పన్నీర్ సెల్వం సీఎం పోస్టు నుంచి దిగిపోయేలా చేసింది. ఆ స్థానంలో ఎడప్పాడి పళనిసామి కూర్చున్నారు. అయితే వీరిద్దరినీ కాదని సీఎం పీఠం ఎక్కేందుకు యత్నించిన జయ నెచ్చెలి శశికళ... ఏకంగా జైలుకు వెళ్లారు.

శశికళ అల్లుడిగా రంగంలోకి దిగిన టీవీవీ దినకరన్... ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. వీరితో పాటు మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. తొలుత చెప్పుకున్న 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... తర్వాత చెప్పుకున్న నాలుగు సీట్లకు మాత్రం ఉప ఎన్నికలకు ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో కోర్టుకెక్కిన విపక్ష డీఎంకే... ఆ నాలుగు స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టింది.

కోర్టు కూడా డీఎంకే వాదనతో ఏకీభవించడంతో ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 22కు చేరింది. 18 స్థానాలకు ఈ నెల 18న లోక్ సభ సీట్లతో పాటే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన నాలుగింటికి వచ్చే నెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో డీఎంకే గానీ దాని మిత్రపక్షాలు గానీ 15కు పైగా సీట్లను సాధిస్తే... పరిస్థితులు తారుమారవడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు అసెంబ్లీలో 111 సీట్ల బలం ఉండగా... విపక్ష డీఎంకేకు 97 సభ్యుల బలం ఉంది.

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేను గద్దె దించేందుకు ఢీఎంకేకు 15 సీట్లు అదనంగా కలిస్తే సరిపోతుంది. అయితే ఉప ఎన్నికల్లో డీఎంకే క్లీన్ స్వీప్ సాధించే అవకాశాలు లేకున్నా... డీఎంకే మిత్రపక్షాలకు ఒకటో. రెండో సీట్లు దక్కితే... అన్నాడీఎంకేకు బ్యాండు బాజానేనని చెప్పక తప్పదు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో తమిళనాట రాజకీయంగా కీలక పరిణామాలకు ఆస్కారం కల్పించేలా ఉప ఎన్నికలు జరగనుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి. అదే సమయంలో ఇప్పుడు ఎడప్పాడి - పన్నీర్ సెల్వంల మద్య అంతగా సయోధ్య ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల తర్వాత మే మాసాంతంలో గానీ జూన్ లో గానీ తమిళనాట రసవత్తర రాజకీయం చోటుచేసుకోనుందన్న మాట. చూద్దాం... ఏం జరుగుతుందో?