Begin typing your search above and press return to search.

త‌మిళ పార్టీల‌కు కొత్త టెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   26 May 2016 1:56 PM GMT
త‌మిళ పార్టీల‌కు కొత్త టెన్ష‌న్‌
X
తమిళనాట శాసనసభ ఎన్నికల ఫలితాలతో విపక్షాలు విలవిలలాడుతున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ ఓ వ్యూహం అనుసరించి దాని ప్రకారం రాజకీయ ఎత్తుగడలు వేశాయి. అయితే అవన్నీ ఎన్నికల ఫలితాల్లో చిత్తయిపోయి అన్నాడీఎంకేకు మళ్లీ అధికారం వచ్చేలా మారాయి. ఈ ఫ‌లితాలకు ముందు తమిళనాడు శాసనసభలో ఎంతోకొంత మొత్తంలో ఆరేడు చిన్న చిన్న పార్టీల ప్రాతినిధ్యం ఉండేది. ఈసారి మాత్రం దాదాపుగా రెండు పార్టీల ప్రాతినిధ్యంగానే మారిపోయింది. కాంగ్రెస్‌, ఐయూఎంఎల్‌ పార్టీల ప్రాతినిధ్యం ఉన్నా వాటి బలమూ, ప్రభావమూ నామమాత్రమే. పైగా అవి డీఎంకే కూటమి పార్టీలు కావడంతో అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకే కూటమి శిబిరాలుగా మారిపోయింది. మిగిలిన పార్టీలకు శాసనసభలో స్థానం లేనంతగా ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించడంతో ఆ పార్టీల్లో నిర్వేదం అలుముకుంది.

ఎన్నికల ఫలితాలు ముగిసి, కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసింది. ఇప్పుడిప్పుడే ఎన్నికల్లో దెబ్బతిన్న చిన్న చిన్న పార్టీలన్నీ కాస్త తేరుకుంటున్నాయి. దాంతో అసలు ఓటమికి కారణాలేమిటనే దానిపై లోతుగా అధ్యయనం చేయడంలో నిమగ్నమయ్యాయి. బీజేపీ, పీఎంకే, డీఎండీకే పార్టీలన్నీ కూడా ఇప్పుడు తమతమ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తూ లోతైన సమీక్ష నిర్వహిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి, పార్టీ పనితీరు తదితర అంశాలపై చర్చ జరగడానికి బీజేపీ, పీఎంకేలు కీలక సమావేశాలు నిర్వహించాయి. ఆ పార్టీ తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులందరితో ఆయా పార్టీల అగ్రనేతలు సమావేశమై చర్చించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయడమే కాకుండా అందరికంటే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో హడావుడి చేసిన పీఎంకే తన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించింది. నియోజకవర్గాల్లో వారికి ఎదురైన పరిస్థితులు, ఓటమికి దారి తీసిన పరిస్థితులపై ఆ పార్టీ నేత అన్బుమణి రామదాసు వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పునర్నిర్మాణం, అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్లాలి తదితర అనేక అంశాలపై వారి అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నట్లు సమాచారం. విపక్షాల్లో చీలిక వల్లే అన్నాడీఎంకే విజయం సాధించిందని కొంతమంది అభ్యర్థులు అభిప్రాయపడినట్లు సమాచారం. మరికొంతమంది జయలలిత ఇచ్చిన ఉచిత హామీలు కొంపముంచాయని అభిప్రాయపడినట్లు తెలిసింది.

ఇక కమలనాథులు కూడా కీలక సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ నేత తమిళిసై సౌందర్‌రాజన్‌ నేత్తృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఎన్నికల్లో పరాభవంపై కమలనాథులు కూడా లోతైన చర్చ జరిపారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ బాగా రాణించిందని, అయితే పార్టీపరంగా కొన్ని వ్యూహాలు బెడిసికొట్టాయనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో ద్రవిడ పార్టీల అండ లేకుండా సొంతంగా ఎదగడం ఎలా అనే దానిపైన చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు కేంద్రబిందువుగా మారిన డీఎండీకే నేత కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ కూడా పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులపై అంతర్మథనం మొదలుపెట్టారు. ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో, పార్టీ కీలక నేతలతో మావేశం ఏర్పాటు చేసి పార్టీ భవిష్యత్తు గురించి చర్చించనున్నారు. ఈ సమావేశం కాస్త ఘాటుగానే జరిగే సూచనలున్నాయని భావిస్తున్నారు. డీఎండీకేలో చాలామంది నేతలకు ప్రజాసంక్షేమ కూటమితో కలసి వెళ్లడం ఇష్టంలేదు, అయితే పార్టీ అగ్రనాయకత్వం పీడబ్ల్యూఎఫ్‌తో వెళ్లాలని నిర్ణయించుకుంది. ఎన్నికల్లో డీఎండీకే ఒక నిర్ణాయకశక్తిగా అవతరిస్తుందని భావించిన కెప్టెన్‌ ఆశలన్నీ ఫలితాల్లో ఆవిరయ్యాయి. 2011 ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీ ఈ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకోవడానికి కారణాలు ఆ పార్టీ నేతలకు అంతుబట్టడం లేదు. ప్రజలు పార్టీని ఈ స్థాయిలో తిరస్కరించడానికి కారణాలేమిటి? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా మారాయి తదితర అనేక అంశాలపై కెప్టెన్‌ ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విపక్ష పార్టీలన్నిటిలోనూ తమ పార్టీలకు పునరుత్తేజం ఎలా కలిగించాలనే దానిపై మేధోమథనం జరుగుతోంది.

మొత్తంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీల నాయ‌కుల‌కు ఐదేళ్ల వ‌ర‌కు శ్రేణుల‌ను ఎలా కాపాడుకోవాల‌నే కకొత్త టెన్ష‌న్ మొద‌ల‌యింద‌నేది మాత్రం ఎవ‌రూ కాద‌న‌లేని నిజం అని చెప్తున్నారు.