Begin typing your search above and press return to search.

మొనగాళ్లంటే.. ఆంధ్రోళ్లే అంటున్న తమిళులు

By:  Tupaki Desk   |   21 Jan 2017 5:02 AM GMT
మొనగాళ్లంటే.. ఆంధ్రోళ్లే అంటున్న తమిళులు
X
తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయటం పట్ల తమిళులు ఎంతగా రగిలిపోతున్నారో తెలిసిందే. సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా రోడ్డెక్కటమే కాదు.. తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన తమిళనాడు బంద్ తో ఆ రాష్ట్ర జనజీవనం స్తంభించిపోయింది. ఇదిలా ఉంటే.. మన దగ్గరి వాట్సప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమంటే..

‘‘వాళ్లు కేవలం జల్లికట్టు కోసం వెంటనే రోడ్డెక్కారు.మనం ప్రత్యేక హోదా కోసం ఇంట్లోనే కూర్చున్నాం. వాళ్లు సాంప్రదాయం దెబ్బ తిన్నా ఒప్పుకోరు.. మనం రాష్ట్రం ఏమైపోయినా కదిలేది లేదు. వాళ్లు మూడు రోజుల్లో కేంద్రాన్ని కదిలించారు. మనం మూడేళ్లయినా ఏమీ చేయలేకపోయాం. అక్కడసినిమా.. రాజకీయం ఏకమైంది. ఇక్కడ సినిమా.. రాజకీయం రాజీ పడింది. తమిళుడు మగడ్రా బుజ్జీ.. మరి మనం..?’’ అంటూ సగటు ఆంధ్రుడు ఆవేశ పడుతున్నాడు.

నిజమే.. ఈ ఆవేశంలోనూ.. ఆవేదనలోనూ నిజాన్ని కాదనలేం. కానీ.. జల్లికట్టుపై ఉన్న బ్యాన్ ను నిషేధించాలంటూ అంతా ఏకమై పోరాటం చేస్తున్న తమిళుల వాదన మరోలా ఉంది. మరీ.. ముఖ్యంగా మెరీనా బీచ్ దగ్గర నిర్వహిస్తున్న నిరసనల్లో ఆంధ్రోళ్ల మాట మారుమోగుతోంది. వారి మాటలు తమిళుల రక్తాన్ని మరింత మరిగేలా చేస్తున్నాయ్. మరింత పట్టుదలను పెంచి.. తాము చేస్తున్నడిమాండ్ ను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారు.

ఇంతకీ.. మెరీనా బీచ్ దగ్గర తమిళుల నోట ఆంధ్రోళ్ల మాట ఎందుకన్నది చూస్తే.. ఏపీలో కోడిపందేల్ని కోర్టులు నిషేధించాయి. పలు అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ.. ఏపీలో కొన్నిచోట్ల కోళ్లకు కత్తులు కట్టి.. మరికొన్నిచోట్ల కత్తులు లేకుండానే పందేలు నిర్వహించారు. ఇదంతా కోర్టు నిబంధనల ఉల్లంఘనే అయినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా.. నిబంధనల్లో ఉన్న లోటుపాట్లను సాకుగా తీసుకొని కోళ్లతో యుద్ధం చేయించారు. అయితే.. ఈ విషయం తమిళుల నోట ఎలా వస్తుందంటే.. ‘‘ఆంధ్రావాసుల్లారా.. మొనగాళ్లంటే మీరే. అనుకున్నట్లే కోడి పందేలు పూర్తి చేసేశారు. మేం మాత్రం ఇంకా జల్లికట్లు జరుపుకోలేక చేష్టలుడిగి నిలిచిపోయాం’ అంటూ నినాదాలు చేస్తుండటం గమనార్హం.

మనమేమో.. తమిళుల పోరాట పటిమను.. వారి కలుసుబాటుతనాన్ని.. చైతన్యాన్ని కీర్తిస్తుంటే.. వారుమాత్రం అక్కడ ఆంధ్రోళ్లు మొనగాళ్లంటే అని అనుకోవటం విశేషం. కోడి పందాల విషయంలో నిబంధనల్లోని సాకుల్ని చూపించి బండి నడిపించే కన్నా.. శాశ్విత పరిష్కారం.. మన సంప్రదాయాన్ని.. సంస్కృతిని పరిరక్షించుకునేలా చర్యల్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అడుగులు పడాలి. ఆంధ్రోళ్లను మొనగాళ్లు అంటూ తమిళులు అన్న మాట నిజం చేయాల్సిన బాధ్యత ఆంధ్రోళ్ల మీద ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/