Begin typing your search above and press return to search.

క‌లెక్ట‌రేట్ ద‌గ్గ‌ర ఆ ఫ్యామిలీ ప్రాణాలు తీసేసుకుంది

By:  Tupaki Desk   |   24 Oct 2017 7:01 AM GMT
క‌లెక్ట‌రేట్ ద‌గ్గ‌ర ఆ ఫ్యామిలీ ప్రాణాలు తీసేసుకుంది
X
అప్పు చేశారు. క‌ష్ట‌ప‌డి తీర్చారు. అప్పు తీర‌లేదంటే.. రెట్టింపు మొత్తాన్ని తీర్చారు. అయినా.. అప్పు తీర‌లేదంటూ వేధింపులు మొద‌లెట్టారు. ఈ వేధింపులు ప‌డ‌లేని కుటుంబ పెద్ద న్యాయం కోసం పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లి న్యాయం చేయ‌మ‌న్నాడు. ఛీ కొట్టారు. న్యాయం కోసం పోతే అవ‌మానాలు ఎదురుకావ‌టం స‌హించ‌లేని ఆ కుటుంబం క‌లెక్ట‌రేట్ వ‌ద్ద‌కు వెళ్లి.. కిరోసిన్ పోసుకొని స‌జీవ‌ద‌హ‌నం చేసుకున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

స‌జీవ ద‌హ‌న‌మైన వారిలో ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. ఏ పాపం తెలీని ఆ ఇద్ద‌రు.. తండ్రి త‌మ‌పై కిరోసిన్ పోసి త‌గ‌ల‌బెట్టేస్తుంటే.. ఆ మంట‌ల దాటికి విల‌విల‌లాడిన వైనం చూస్తే గుండె త‌రుక్కుపోవ‌టం ఖాయం. మంట‌ల్లో చిక్కుకున్న చిన్నారిపై అక్క‌డున్న వారు మ‌ట్టి పోస్తే.. అలా మ‌ట్టిలో ప‌డిపోయిన వైనం చూసినోళ్ల క‌ళ్ల‌ల్లో క‌న్నీళ్లు ఆగ‌లేదు. క‌లెక్ట‌రేట్ ద‌గ్గ‌ర త‌మ‌ను తాము త‌గ‌లబెట్టేసుకున్న ఈ ఉదంతం గురించి విన్న‌వారంతా అయ్యో అన‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. త‌మిళ‌నాడులోని తిరున‌ల్వేలి క‌లెక్ట‌రేట్ వ‌ద్ద చోటు చేసుకున్న ఈ హృద‌య విదార‌క ఉదంతంలోకి వెళితే..

తిరున‌ల్వేలి జిల్లా కాశిధ‌ర్మం ప్రాంతానికి చెందిన భార్య‌భ‌ర్త‌లు ఇస‌క్కి ముత్తు.. సుబ్బుల‌క్ష్మిలు. వారికి మ‌ది శ‌ర‌ణ్య (5).. అక్ష‌య భ‌ర‌ణి (2) ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. కొంత‌కాలం క్రితం ముత్తు కందువ‌డ్డీ వ్యాపారి ముత్తుల‌క్ష్మి వ‌ద్ద వ్యాపారం కోసం రూ.1.40ల‌క్ష‌లు అప్పు తీసుకున్నారు. అస‌లుకి రెట్టింపు మొత్తాన్ని క‌ట్టాడు. వ‌డ్డీతో క‌లుపుకొని రూ.2. 5 ల‌క్ష‌లు చెల్లించాడు. అయిన‌ప్ప‌టికీ త‌న అప్పు తీర‌లేద‌ని ముత్తుల‌క్ష్మీ ప‌ట్టుబ‌ట్టి.. వేధింప‌సాగింది. ఈ ఒత్తిళ్ల‌ను త‌ట్టుకోలేని ముత్తు పోలీసుల్ని ఆశ్ర‌యించారు.

అయితే.. ముత్తును గ‌ట్టిగా మంద‌లించి పంపించేశారు పోలీసులు. దీంతో త‌న క‌ష్టాల్ని తిరున‌ల్వేలి క‌లెక్ట‌ర్‌ను క‌లిసి గోడు వెళ్ల‌బోసుకున్నాడు. ముత్తు నుంచి ఫిర్యాదు తీసుకొని విచారించాల‌ని ఆదేశించారు. అయినా.. పోలీసుల్లో క‌ద‌లిక లేదు. దీంతో విసుగు చెందిన ముత్తు.. అత‌ని కుటుంబ స‌భ్యులంతా క‌లిసి సోమ‌వారం ఉద‌యం క‌లెక్ట‌రేట్ కార్యాల‌యం వ‌ద్ద‌కు వ‌చ్చారు. అంద‌రూ చూస్తుండ‌గానే.. అంద‌రి వంటిపై కిరోసిన్ జ‌ల్లి తానూ నిప్పు పెట్టుకున్నారు.

ఊహించ‌ని పరిణామంతో ఉలిక్కిప‌డ్డ వారంతా నిప్పు అంటించుకున్న కుటుంబాన్ని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. వారిపై మ‌ట్టిని చ‌ల్లారు. అంబులెన్స్ ను తెప్పించారు. అత్య‌వ‌స‌ర చికిత్స కోసం పాళ‌యం కోట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. భార్య సుబ్బుల‌క్ష్మి.. ఇద్ద‌రు కుమార్తెలు చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌గా.. ముత్తును కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెబుతున్నారు. త‌మ‌ను తాము స‌జీవ ద‌హ‌నం చేసుకున్న త‌ర్వాత కానీ స్పందించ‌ని పోలీసులు.. కుందు వ‌డ్డీ వ్యాపారి ముత్తుల‌క్ష్మి.. ఆమె భ‌ర్త ద‌ళ‌వాయ్ రాజ్ ను అత‌ని బంధువుల‌ను అరెస్ట్ చేసి విచార‌ణ షురూ చేశారు. ఇదేదో బాధితుడి ఫిర్యాదు ఇచ్చిన‌ప్పుడే పోలీసులు చేస్తే.. ఒక నిండు కుటుంబం ఇలాంటి దారుణ నిర్ణ‌యాన్ని తీసుకునేది కాదేమో?