Begin typing your search above and press return to search.

ట్రెక్కింగ్‌ కు వెళ్లిన 9 మంది విద్యార్థుల మృతి

By:  Tupaki Desk   |   12 March 2018 7:59 AM GMT
ట్రెక్కింగ్‌ కు వెళ్లిన 9 మంది విద్యార్థుల మృతి
X
పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం సరదాగా ట్రెక్కింగ్ చేద్దామనుకున్న విద్యార్థులకు ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఆశనిపాతంలా పరిణమించాయి. ఊహించని రీతిలో మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో విద్యార్థుల హాహాకారాలు అడవిలో దద్దరిల్లాయి. ట్రెక్కింగ్‌ కు వెళ్లిన సుమారు 40మంది మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుండగా వారిలో అమ్మాయిలు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తొమ్మిది మంది విద్యార్థులు మంటల్లో చిక్కుకుని మరణించగా - ఓ విద్యార్థిని సహా 15 మందిని కాపాడినట్లు సమాచారం. చెన్నైకి చెందిన అఖిల - ప్రేమలత - పునిత - సుధ - అరుణ - విబణి - ఈరోడ్ కు చెందిన దివ్య - వివేక్ - తమిళ సెల్వి సజీవదహనం అయ్యారని థేనీ జిల్లా అధికారులు గుర్తించారు. అటవి ప్రాంతంలో చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

చెన్నై ట్రెక్కింగ్ క్లబ్ కు చెందిన 25 మంది యువతులు - 8 మంది పురుషులు - ఈరోడ్ - తిరప్పూర్ కు చెందిన 13 మంది సభ్యులు థేనీ జిల్లాలోని కురంగని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చెయ్యడానికి శనివారం మద్యాహ్నం వెళ్లారు. అయితే ఇదే స‌మ‌యంలో అనుకోనిరీతిలో మంటలు చెలరేగడంతో చిక్కుకునిపోయారు. సంఘటనను ఓ విద్యార్థి తన తండ్రికి మొబైల్ ద్వారా సమాచారమివ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వీరంతా కేరళ సూర్యనెళ్లిలోని మున్నార్ వైపు నుంచి థేని వైపునకు ఎవరి సహాయం తీసుకోకుండానే ట్రెక్కింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు కోయంబత్తూరు - ఈరోడ్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. మంటల్లో చిక్కుకున్న వారికి ప్రథమ చికిత్స అందించేందుకు వైద్య బృందాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. పోలీస్ సూపరింటెండెంట్ వి భాస్కరన్ సహా రెవెన్యూ - అటవీ శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.అయితే ఆదివారం రాత్రి చీకటిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

తమిళనాడు అటవీ శాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ హెచ్ బసవరాజు ఈ ఉదంతంపై స్పందిస్తూ `వేసవి ప్రారంభమైనందున పశ్చిమ కనుమల్లోని అటవీప్రాంతం ఎండిపోతుంది. ఏపుగా పెరిగిన లెమన్ గ్రాస్‌కు త్వరగా మంటలు అంటుకుంటుంది. అందుకని కనుమ వెంట ట్రెక్కింగ్ చేసేందుకు ఎవర్నీ అనుమతించడం లేదు. మున్నార్ వైపున వాహనాలను పార్కింగ్ చేసిన విద్యార్థులు థేని వైపునకు ట్రెక్కింగ్ చేయడం ప్రారంభించారు. బోది గ్రామం వైపు దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారు చిక్కుకునిపోయారు` అని తెలిపారు.

ఇదిలాఉండ‌గా... ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్పందించారు. త‌మిళ‌నాడు సీఎం పళనిస్వామి - ఉప ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మ‌రోవైపు భార‌త వాయుసేనకు చెందిన‌ మూడు హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 15 మందిని క్షేమంగా రక్షించామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్టర్ లో తెలిపారు. విద్యార్థులను రక్షించడానికి ప్రత్యేక బృందాలను పంపించామని కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహ్రా మీడియాకు చెప్పారు.