Begin typing your search above and press return to search.

ఆసుపత్రిలో ‘అమ్మ’ ఏం చేస్తున్నారంటే..

By:  Tupaki Desk   |   27 Sep 2016 8:14 AM GMT
ఆసుపత్రిలో ‘అమ్మ’ ఏం చేస్తున్నారంటే..
X
గడిచిన నాలుగైదు రోజులుగా అమ్మగా కొలిచే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు మీడియాను ముంచెత్తాయి. తీవ్రమైన జ్వరం.. డీహైడ్రేషన్ తో చెన్నై అపోలోకు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా తరలించటంపై చాలానే ఊహాగానాలు వినిపించాయి. అయితే.. అందరూ అనుకున్నట్లుగా ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా లేదని.. ఆమె ఆరోగ్యం కుదుటపడినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. మెరుగైన వైద్యం కోసం సింగపూర్ కు అమ్మను తరలించినట్లుగా వచ్చిన వార్తలతో తమిళనాడు అధికారపక్ష నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. అలాంటిదేమీ లేకుండా అమ్మ అపోలో ఆసుపత్రిలోనే కుదుట పడ్డారు.

ఇదిలా ఉంటే.. అమ్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తరచూ ఆమెను అభిమానించే వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అయితే.. అమ్మ ఆరోగ్యంపై అనుమానాలు ఉన్న వారు ఎవరూ కూడా కించిత్ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నట్లుగా తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఉన్న అమ్మ ఆరోగ్యవంతంగా ఉండటమే కాదు.. ఆసుపత్రినే వేదికగా తీసుకొని ఆమె పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం.

మరికొద్ది రోజుల్లో తమిళనాట జరగనున్న స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఆభ్యర్థుల జాబితాను ఆసుపత్రిలో ఉన్న అమ్మ ఆమోదంతో విడుదల చేయటం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పరిహారాన్ని ఆసుపత్రి నుంచి విడుదల చేయటంతో.. అమ్మ ఆరోగ్యం మీద ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్న విషయం తేలిపోయింది. ముందస్తు జాగ్రత్తతోనే ఆసుపత్రిలో ఉంచి ఆమెకు వైద్యులు పరీక్షలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాల వేగాన్ని చూసినప్పుడు అమ్మ నార్మల్ అయిపోయారని.. ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తేలిపోయినట్లేనని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. అమ్మను అభిమానించే వారికి ఇంతకంటే సంతోషకరమైన వార్త ఇంకేం ఉంటుంది..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/