Begin typing your search above and press return to search.

యాక్ట‌ర్ల‌కు త‌ల‌సాని వార్నింగ్ విన్నారా?

By:  Tupaki Desk   |   26 July 2017 9:17 AM GMT
యాక్ట‌ర్ల‌కు త‌ల‌సాని వార్నింగ్ విన్నారా?
X
ఎవ‌రైనా మాట్లాడ‌గ‌ల‌రు. కాకుంటే.. తాము మాట్లాడే మాట‌ల‌తో ఎవ‌రికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌న్న విష‌యాన్ని ఆలోచించి మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తేనే అస‌లు తిప్ప‌లంతా. డ్ర‌గ్స్ విచార‌ణ విష‌యంలో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారి తాజా వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. అంద‌రిని వ‌దిలేసి.. త‌మ‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నారన్న‌ట్లుగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్రెస్ నోట్ల‌లోనూ.. సోష‌ల్ మీడియాలోనూ.. మీడియాలోనూ మాట్లాడుతున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భుత్వాన్ని నేరుగా విమ‌ర్శించ‌కున్నా.. డ్ర‌గ్స్ విచార‌ణ చేస్తున్న అధికారుల్ని.. ఆ వార్త‌ల్ని క‌వ‌ర్ చేస్తున్న మీడియాపై ఒంటికాలిపై ఎగురుతున్నారు. మీడియాకు ఇలాంటి తిట్లు.. అవ‌మానాలు.. ఎక్క‌సాలు మామూలే. వారి త‌ర‌ఫున గ‌ళం విప్పేవారు.. నిల‌దీసే వారు ఎవ‌రూ ఉండ‌దు. మీడియాను త‌ప్పు ప‌ట్టిన‌ట్లుగా అధికారుల్ని త‌ప్పు ప‌డితే వారు ఉరుకుంటారా? ఇష్యూకు ఉన్న సెన్సిటివిటీ కార‌ణంగా అధికారులు త‌మ‌దైన శైలిలో కౌంట‌ర్ అటాక్ స్టార్ట్ చేయ‌కున్నా.. ఇలాంటి విమ‌ర్శ‌ల‌న్నీ అంతిమంగా వ‌చ్చి ఆగేది ప్ర‌భుత్వం ద‌గ్గ‌రే అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

అందుకే కాబోలు.. ఇంత‌కాలం డ్ర‌గ్స్ విచార‌ణ మీద పెద్ద‌గా మాట్లాడ‌ని తెలంగాణ అధికార ప‌క్ష నేత‌లు ఇప్పుడు గొంతు స‌వ‌రించుకుంటున్నారు. ఆ మ‌ధ్య‌న హోం మంత్రి నాయిని.. మంత్రి కేటీఆర్ మాట్లాడినా ఆచితూచే త‌ప్పించి వార్నింగ్ మాదిరి మాట్లాడ‌లేదు.

కానీ.. అందుకు భిన్నంగా తాజాగా తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ పెద‌వి విప్పారు. సిట్ విచార‌ణ‌లో వెల్ల‌డైన వాస్త‌వాల ఆధారంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టుల‌పై చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. డ్ర‌గ్స్ విచార‌ణ ఉదంతం తెర మీద‌కు వ‌చ్చిన త‌ర్వాత త‌ల‌సాని పెద‌వి విప్ప‌టం ఇదే తొలిసారి. సిట్ ద‌గ్గ‌ర ఉన్న సాక్ష్యాల ఆధారంగా కొంద‌రు సినీ ప్ర‌ముఖుల్ని విచారిస్తున్నామ‌ని.. సిట్ విచార‌ణ పూర్తి అయ్యాక చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన పెద్ద‌ల‌తో స‌మావేశం కానున్న‌ట్లు వెల్ల‌డించారు.

డ్ర‌గ్స్ వివాదంలో సినీ ప‌రిశ్ర‌మ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింద‌న్న మాట వాస్త‌వం కాద‌ని.. ఈ వ్య‌వ‌హారాన్ని మొత్తం ఇండ‌స్ట్రీకి ఆపాదించ‌టం స‌రికాద‌న్న మాట‌ను ఆయ‌న చెప్పారు. మాద‌క ద్ర‌వ్యాల వ్య‌వ‌హారం ప‌ర్స‌న‌ల్ అని.. సంబంధిత శాఖ దానిపై చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హంగా ఉన్నార‌ని.. దీని కార‌ణంగా చాలామంది జీవితాలు నాశ‌నం అవుతాయ‌న్న స‌మాచారంతోనే ప్ర‌భుత్వం ఈ ఉదంతంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లుగా చెప్పారు. సిట్ విచార‌ణలో వెల్ల‌డైన వాస్త‌వాల ఆధారంగా సినీ ప‌రిశ్ర‌మ‌లోని న‌టీన‌టుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న మాట‌ను సూటిగా చెప్పిన మంత్రి త‌ల‌సాని మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.