తాజ్ వివాదంపై సంచలన క్లారిటీ ఇచ్చిన షాజహాన్ మనవడు

Mon Apr 16 2018 21:30:00 GMT+0530 (IST)

ప్రేమ సౌదం తాజ్‌మహల్ అనూహ్య వార్తలతో తెరమీదకు ఎక్కింది. తాజ్‌మహల్‌పై హక్కు ఎవరిదనే వాదన ప్రశ్న కోర్టుల్లో నానుతున్న సంగతి తెలిసిందే. తాజ్ తమ ఆస్తి అని 2005 జూలైలో వక్ఫ్‌బోర్డు ప్రకటించుకోగా దీన్ని వ్యతిరేకిస్తూ భారత పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) 2010లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై వాదనల సందర్భంగా చీఫ్‌జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ..`తాజ్‌మహల్ వక్ఫ్‌బోర్డుకు చెందుతుందంటే ఎవరైనా నమ్ముతారా? షాజహాన్ వక్ఫ్‌నామాపై ఎలా సంతకం చేశారు? దాన్ని మీకెప్పుడు ఇచ్చారు? అని ప్రశ్నించారు. మొఘల్ చక్రవర్తి నాటి కాలంలో వక్ఫ్‌నామా అనేది కూడా లేదు` అని ఏఎస్‌ఐ తరఫు న్యాయవాది ఏడీఎన్‌రావు చెప్పారు. షాజహాన్‌ను ఆయన కుమారుడు ఔరంగజేబ్ నిర్బంధించారు. ఆ నిర్బంధంలోనే ఆయన మృతిచెందారు. మరి కస్టడీలో ఉండగా వక్ఫ్‌నామాపై ఎలా సంతకం చేశారు? అని ధర్మాసనం ఆదేశించింది.ఇలా తాజ్‌మహల్ మాది అంటూ సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో వాదిస్తున్న ఎపిసోడ్‌లో అనూహ్య ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ తాజ్‌మహల్‌ను కట్టిన మొఘల్ వంశానికి చెందిన వైహెచ్ తుసి అనే వ్యక్తి దీనిపై స్పందించాడు. చివరి మొఘల్ చక్రవర్తి బాహదూర్ షా జాఫర్‌కు తాను ముని మనవడినని తుసి చెప్పాడు. తాజ్‌మహల్ భారత్‌కు చెందుతుంది.. సున్నీ వక్ఫ్ బోర్డుకు కాదని అతను స్పష్టంచేశాడు. అంతేకాదు అయోధ్యలో బాబ్రీ మసీదు భూమి కూడా వక్ఫ్ బోర్డుది కాదని తుసి స్పష్టంచేశాడు. తాజ్‌మహల్ దేశ సంపద.. దీనిపై ఎవరికీ హక్కు లేదు అని తుసి తేల్చి చెప్పాడు. షాజహాన్ వక్ఫ్ బోర్డుకు తాజ్‌మహల్ రాసివ్వలేదు. ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయానికి వస్తే.. అక్కడ కచ్చితంగా మందిరం నిర్మించాల్సిందే. మతాల మధ్య చీలిక తీసుకొస్తున్న ఇలాంటి అంశాలను పరిష్కరించడానికి ఎవరు ముందుకొచ్చినా నేను మద్దతిస్తాను అని తుసి స్పష్టంచేశాడు.

సున్నీ వక్ఫ్ బోర్డు పెద్ద కబ్జాకోరని వాళ్ల ఆఫీస్‌లో కుర్చీలు - టేబుళ్లు కూడా లేనివాళ్లు తాజ్‌మహల్ నిర్వహణ ఎలా చేస్తారు అని తుసి ప్రశ్నించాడు. వాళ్లు హిందు - ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తుసి ఆరోపించాడు. మొఘల్ వంశీయుడిగా నేను ఈ ఆస్తులన్నింటినీ భారత ప్రభుత్వానికి రాసిచ్చేస్తాను. ఇప్పటికే దీనిపై నేను వేసిన కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది అని ఆయన చెప్పాడు. తాజ్‌మహల్‌పై రాజకీయాలు చేసే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పాడు. ఈ మధ్యే షాజహాన్ ఉర్స్ నిర్వహించి దానికి ఆరెస్సెస్ కార్యకర్తలను కూడా ఆహ్వానించాడు. కాగా షాజహాన్ మనవడి ప్రకటన నేపథ్యంలో కేసు తీర్పుపై ఆసక్తి నెలకొంది.