Begin typing your search above and press return to search.

జాతీయ మీడియాలోకి ఇక తెలుగు వెలుగు

By:  Tupaki Desk   |   17 Feb 2019 8:55 AM GMT
జాతీయ మీడియాలోకి ఇక తెలుగు వెలుగు
X
అంతా ఉత్తరాది పెత్తనమే.. అంతా హిందీ రాజ్యమే.. కేంద్రంలో అధికారం వారిదే.. మీడియాలో పెత్తనం వారిదే.. హిందీ బెల్ట్ రాష్ట్రాల నేతలకే ప్రాముఖ్యం.. దక్షిణాది వారి సమస్యలు, ఇక్కడి నేతలకు ప్రాముఖ్యత దక్కదు. కానీ ఇప్పుడు దేశ జాతీయ మీడియాపై తనదైన ముద్ర వేయడానికి ఓ తెలుగు మీడియా సంస్థ వడివడిగా అడుగులేస్తోంది. టీవీ9 ను స్థాపించి ప్రాంతీయ రాష్ట్రాలకు విస్తరించిన రవిప్రకాష్ ఓ బ్రాండ్ ను సృష్టించారు. తెలుగు, కన్నడ, గుజరాతీ, మరాఠీ సహా పలు భాషల్లో టీవీ9 సేవలందిస్తోంది. ఇప్పుడు ఏకంగా హిందీలో జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు టీవీ9 నడుం బిగించింది.. ఈ మేరకు సీఈవో రవిప్రకాష్ హిందీలో ‘‘టీవీ9-భారత్ వర్ష’’ పేరుతో జాతీయ చానెల్ ను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీవీ9 జాతీయ చానెల్ కోసం మెరికలైన ప్రముఖ జర్నలిస్టులను రిక్రూట్ చేసేందుకు రవిప్రకాష్ సిద్ధమయ్యారు. ప్రజల ఆసక్తిగా అనుగుణంగా వార్తలిస్తూ టీవీ9 ఇప్పుడు తెలుగులో నంబర్ 1గా నిలిచింది. అదే స్ట్రాటజీతో హిందీలో కూడా దూసుకుపోవాలని స్కెచ్ గీసింది. వచ్చే నెల నుంచి అన్ని రకాల ఫ్లాట్ ఫామ్స్ లో టీవీ9-భారత్ వర్ష ప్రసారాలు లభ్యమవుతాయని.. టీవీ9 యాజమాన్య సంస్థ ప్రకటించింది.

టీవీ9 యాజమాన్యం ఇటీవల చేతులు మారింది. మెజార్టీ వాటా ఉన్న ఏబీసీఎల్ ప్రమోటర్ అయిన శ్రీనిరాజు నుంచి తెలుగువారైన ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు మెజార్టీ వాటాను కొనుగోలు చేశారు. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో జాతీయస్థాయిలో ‘టీవీ9-భారత్ వర్ష’ను లాంచ్ చేయడానికి చానెల్ సీఈవో రవిప్రకాష్ సర్వం సిద్ధం చేస్తున్నారు. దానికి కొత్త యాజమాన్యం కూడా సంపూర్ణ సహకారం అందిస్తోంది. అందుకే కొత్త చానెల్ లో అత్యాధునిక ఏఆర్-వీఆర్ టెక్నాలజీని సమకూర్చుకొని వార్తలను కళ్లకు కట్టినట్టు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇప్పటివరకూ జాతీయ మీడియా రంగంలో దక్షిణాది వారికి పెద్దగా ప్రాముఖ్యత లేదు. హిందీ భాషతోనే ఎక్కువగా జాతీయ మీడియా ముడిపడి ఉంది. దక్షిణాదిలో మీడియా బలంగా ఉన్నా.. అది కేంద్రం స్థాయిలో ప్రభావితం చూపడం లేదు. రామోజీరావు ఈటీవీని దేశవ్యాప్తంగా విస్తరించినా దాన్ని నడుపలేక అమ్ముకున్నారు. ఇప్పుడు మరో తెలుగు జర్నలిస్ట్ రవిప్రకాష్ జాతీయ స్థాయిలో తెలుగు ముద్ర వేయడానికి టీవీ9-భారత్ వర్ష చానెల్ ను లాంచ్ చేస్తున్నారు. ఇది ఏమేరకు ప్రభావితం చేస్తుందనేది వేచిచూడాల్సిందే.