Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక బ‌రిలోకి..దిన‌క‌ర‌న్ షాకింగ్ నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   23 Oct 2017 10:42 AM GMT
ఉప ఎన్నిక బ‌రిలోకి..దిన‌క‌ర‌న్ షాకింగ్ నిర్ణ‌యం!
X
దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంతరం త‌మిళ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీని త‌ల‌పిస్తూ అక్క‌డి రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. శ‌శిక‌ళ‌-దిన‌క‌ర‌న్‌ - ప‌ళ‌ని - ప‌న్నీర్ వ‌ర్గాల మ‌ధ్య ఆధిపత్య పోరు - ఏఐడీఎంకేలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు....త‌మిళ తంబీల కుమ్ములాట‌లు వెర‌సి త‌మిళ రాజ‌కీయాలు త‌మిళ రాజ‌కీయాలు ర‌స‌త‌వ్త‌రంగా మారాయి. మ‌న్నార్ గుడి మాఫియా స‌హ‌కారంతో త‌మిళ‌రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్పాల‌నుకున్న జ‌య నిచ్చెలి శ‌శికళ 'కల' క‌ల‌గానే మిగిలిపోయింది. త‌న అంగ‌బ‌లంతో అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని చూసిన శ‌శిక‌ళ మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌డంతో శ‌శిక‌ళ వ‌ర్గానికి గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఈ నేప‌థ్యంలో 'అమ్మ మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నికపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్పడింది. డిసెంబర్ 31లోగా ఉప ఎన్నిక ప్ర‌క్రియ పూర్తి చేయాలని మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశించ‌డంతో అన్ని పార్టీలు త‌మ అభ్య‌ర్థులను ఎంచుకునే ప‌నిలోపడ్డాయి. ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ షాకింగ్ ప్ర‌క‌ట‌న చేశారు. (రాధాకృష్ణన్‌ నగర్‌) ఆర్కే నగర్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక‌లో తానే స్వ‌యంగా బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రికీ షాక్ ఇచ్చారు. సోమ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో దిన‌క‌ర‌న్ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

ఆర్కే నగర్ ఉప ఎన్నికలో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు అన్ని పార్టీలు త‌ల‌మున‌క‌లై ఉన్నాయి. అమ్మ ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌కవ‌ర్గం కావ‌డంతో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నిక‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తానే స్వ‌యంగా బ‌రిలోకి దిగబోతున్న‌ట్లు దిన‌క‌ర‌న్ ప్ర‌క‌టించ‌డంతో త‌మిళ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. అంతేకాదు, త‌న‌పై ఎవ‌రు పోటీ చేసినా....గెలుపు త‌న‌దేనంటూ దిన‌క‌రన్ ధీమా వ్య‌క్తం చేశారు. త‌న త‌ర‌పున ఎవ‌రో ఒక అభ్య‌ర్థిని నిల‌బెడ‌తార‌ని అంద‌రూ భావిస్తున్న స‌మ‌యంలో దిన‌క‌ర‌న్ స్వయంగా పోటీ చేయ‌డం చర్చనీయాంశమైంది. ఆర్కే నగ‌ర్ ఉప ఎన్నిక‌లో విజయం సాధించి అమ్మకు అసలైన వారసులం తామేనని (శశికళ వర్గం) నిరూపించుకోవాల‌ని దిన‌క‌రన్ గ‌ట్టి ప‌ట్టుద‌లతో ఉన్నారు. మ‌రోవైపు పార్టీలో అంతర్గతంగా చర్చించిన త‌ర్వాతే త‌మ‌ అభ్యర్థి పేరును ప్రకటిస్తామని అన్నాడీఎంకే తెలిపింది. డీఎంకే తరపున అభ్యర్థి దాదాపు ఖరారైనట్లేనని, మరో వారంలో అభ్య‌ర్థి పేరును ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాస్త‌వానికి ఆర్కే న‌గర్ ఉప ఎన్నిక‌ ఈ ఏడాది ఏప్రిల్‌ లోనే జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో ఓటర్లను ప్ర‌లోభ‌పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతున్నార‌ని అధికారులు గుర్తించారు. ఆ అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావటంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నిక‌ను వాయిదా వేసి విచారణకు ఆదేశించింది. అయితే, ఈ ఉప ఎన్నికపై స్పష్టత ఇవ్వాలంటూ కోర్టులో పిటిష‌న్ దాఖలైంది. ఆ పిటిషన్‌ పై స్పందించిన మద్రాస్‌ హైకోర్టు డిసెంబర్ 31లోగా ఉప ఎన్నిక ప్ర‌క్రియ పూర్తి చేయాలని ఎన్నిక‌ల క‌మిష‌న్ ను ఆదేశించింది.