Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ కు చెమ‌ట‌లు ప‌ట్టించిన టీడీపీ గేమ్ ప్లాన్‌

By:  Tupaki Desk   |   3 May 2016 11:21 AM GMT
టీఆర్ ఎస్‌ కు చెమ‌ట‌లు ప‌ట్టించిన టీడీపీ గేమ్ ప్లాన్‌
X
ఎన్నిక‌లు.. తెలంగాణ‌లో ఈ మాట వింటే ఎక్కువ‌గా ఉలిక్కి ప‌డేది టీడీపీ!! ఎందుకంటే ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. పోటీచేయ‌డం దారుణంగా ఓడిపోవ‌డం ఇదీ కొంత‌కాలం నుంచీ టీడీపీ ప‌రిస్థితి. ముఖ్యంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ ప‌రిస్థితి అక్క‌డ మ‌రింత ద‌య‌నీయంగా మారింది.

ఈ త‌రుణంలోనే మళ్లీ ఖ‌మ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. మరి ఇందులో టీడీపీ పోటీ చేస్తుందా? లేదా అనే సందేహాలు అంద‌రిలోనూ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా నామా నాగేశ్వ‌ర రావును త‌మ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. దీంతో టీఆర్ ఎస్‌ కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. కానీ ఇంత‌లోనే పోటీ నుంచి విరమిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది టీడీపీ. మ‌రి టీటీడీపీకి సంతృప్తినిచ్చింది ఏమిటి? పాలేరు పోరులోనే లేని ఆ పార్టీ ఈ ఎన్నికలో పొందిన లబ్ధి ఏమిటి? అంటే..

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే - సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి అకాల మరణంతో పాలేరుకు ఉప ఎన్నిక అనివార్యం అయింది. గత ఉప ఎన్నికల ఫలితాల అనుభవాలతో తల బొప్పికట్టి ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు మొదట్లో పాలేరు వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేదు. మొదట్లో ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నించింది కాంగ్రెస్. ఈ సమయానికి టీడీపీ ఎక్కడా సీన్ లోనే లేదు. ఈ క్రమంలోనే టీఆర్ ఎస్ అంద‌రికంటే ముందుగా త‌న అభ్య‌ర్థిగా మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును రంగంలోకి దించింది.

తుమ్మలకు ధీటుగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును బరిలోకి దింపితే బాగుంటుందన్న ప్రతిపాదనను టీడీపీ అధిష్టానం ముందు ఉంచారు. ఈ ప్రతిపాదనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముందు చెప్పగానే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నామా పేరు తెర మీదకు రాగానే టీఆర్ ఎస్ శిబిరం అలెర్ట్ అయింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన స్వర్ణ కుమారినే బరిలోకి దింపుతుందని అంతా ఊహించారు. నామా పేరు రావడంతో... ఆయన బలమైన అభ్యర్థి కావడంతో పాలేరు పోరు వేడెక్కింది.

నామా బ‌రిలోకి దిగితే నామా - తుమ్మ‌ల ఒకే సామాజిక‌వ‌ర్గం వారు కావ‌డంతో ఓట్లు ఎక్క‌డ చీల‌తాయో అని, ఇక ప్ర‌తిప‌క్షాలు ఏక‌మైతే త‌మ పార్టీ ప‌రిస్థితి ఏంటా అని టీఆర్ ఎస్ అగ్ర నాయ‌క‌త్వం సైతం క‌ల‌వ‌ర‌ప‌డింది. అయితే స‌డెన్‌ గా కాంగ్రెస్ నేత‌లు టీడీపీకి లేఖ రాయ‌డంతో పోటీనుంచి విర‌మించింది. మొత్తం ఎపిసోడ్‌ లో ఆదిలో తాము అసలు సీన్‌ లో కూడా లేని పరిస్థితి నుంచి రెండు రోజుల పాటు టీఆర్ ఎస్‌ కు ముచ్చెమటలు పట్టించగలిగామన్న సంతృప్తి తమకు మిగిలిందన్న భావన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంది.