Begin typing your search above and press return to search.

ఆ 8 మందికి సిగ్నల్ ఇచ్చినా.. వీడని సంధిగ్థత

By:  Tupaki Desk   |   19 Oct 2018 9:25 AM GMT
ఆ 8 మందికి సిగ్నల్ ఇచ్చినా.. వీడని సంధిగ్థత
X
సీట్ల సర్దుబాటు ముందు గొయ్యి... వెనుక నుయ్యిలా ఉంది కూటమి పరిస్థితి. కాంగ్రెస్ అధిష్ఠానం ఎనిమిది మంది టీడీపీ సీనియర్ నేతల పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఎక్కడ నుంచి పోటీ చేయించాలనేదే సస్పెన్స్ గా మారింది. వారు కోరుకున్న చోట కాంగ్రెస్ అభ్యర్థులు కూడా పోటీకి సై అంటుండటంతో సీట్ల సర్దుబాటును తేల్చడం సమస్యలా మారింది.

కూటమి పంపకాల్లో భాగంగా టీడీపీకి కాంగ్రెస్ 15 స్థానాలు ఇవ్వాలని భావిస్తుందని సమాచారం. వీటిలో 8 మంది టీడీపీ సీనియర్ నేతలు పోటీ చేసేందుకు సుముఖత లభించింది. వీరిలో దేవేందర్ గౌడ్ - నామా నాగేశ్వరరావు - రావుల చంద్రశేఖర్ రెడ్డి - పెద్దిరెడ్డి - కొత్తకోట దయాకర్ - అరవింద్ గౌడ్ - వెంకట వీరయ్య - ఎల్ రమణ ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, వీరు కోరుకున్న చోట సీట్ల సర్దుబాటు చేయడం ఎలా అనే దానిపైనే ఇంకా సంధిగ్థత వీడ లేదు.

టీడీపీ నేత ఎల్ రమణ కూడా ఎక్కడ నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఆయన జగిత్యాల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉన్నారు. టిక్కెట్ తనకే ఖాయమని చెబుతున్న జీవన్ రెడ్డి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఇక, పెద్దిరెడ్డి ఈ సారి కూకట్ పల్లి నుంచి పోటీ చేసేందుకు సిద్ధ పడుతున్నారు. అయితే, టీడీపీలోనే చాలా మంది ఆశావహులు పోటీకి వస్తుండటంతో, కాంగ్రెస్ నేతలే పోటీ చేస్తారంటూ కొత్త రాగం అందుకున్నారు. ఇక్కడ సెటిలర్ల ఓటింగ్ ఎక్కువని - తమకు కూడా మంచి పట్టు ఉందని చెబుతున్నారు. పెద్దిరెడ్డిని హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారట. అయితే పెద్దిరెడ్డి మాత్రం కూకట్ పల్లి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు.

మరో నేత దేవేందర్ గౌడ్ విషయానికి వస్తే.. ఆయనకు బీసీల్లో బలమైన పట్టు ఉండటంతో - మహేశ్వరం - రాజేంద్ర నగర్ లలో ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపొందుతారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. అయితే, ఆయన మాత్రం తన కొడుకు వీరేందర్ గౌడ్ ను ఈ సారి ఎన్నికల బరిలో నిలిపి తాను పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారట. ఉప్పల్ నుంచి వీరేందర్ నుంచి గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో పోటీలో నిలవాలని కాంగ్రెస్ సూచిస్తూనే - గెలిచే స్థానాలను దూరం చేస్తుందని టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. కోరుకునన్ని సీట్లు ఇవ్వకపోయినా, కూటమి ఐక్యతకు భంగం వాటిల్లకూడదని చంద్రబాబు సూచించారు. ఆ మేరకు సర్దుకుపోయినా - కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేయడం లేదని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కూటమిలో కొత్త రచ్చకు దారితీసింది. మరి ఈ వివాదానికి ఎలా పరిష్కారం లభిస్తుందో వేచి చూడాల్సిందే.