Begin typing your search above and press return to search.

రేవంత్ జంపింగ్‌..టీటీడీపీలో శ్మ‌శాన వైరాగ్యం

By:  Tupaki Desk   |   18 Oct 2017 6:16 PM GMT
రేవంత్ జంపింగ్‌..టీటీడీపీలో శ్మ‌శాన వైరాగ్యం
X
అవును. తెలంగాణ టీడీపీ ఇప్పుడు బిత్త‌ర చూపులు చూస్తోంది. మొద‌ట పార్టీ నేత‌లు - ఆ త‌ర్వాత ఎమ్మెల్యేలు - త‌దుప‌రి ఎంపీలు...చివ‌ర‌గా....తెలంగాణ టీడీపీ ఫ్లోర్‌ లీడ‌ర్ హోదాలో ఎర్ర‌బెల్లి ద‌యాక‌రరావు మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను క‌లుపుకొని అధికార టీఆర్ ఎస్‌ లోకి జంప్ అవ‌డం...ఇలా దెబ్బ మీద దెబ్బ‌తో కునారిల్లుతున్న తెలంగాణ టీడీపీని టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌...ఆ పార్టీ గ‌ళం అన్న‌ట్లుగా ఉండే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేర‌డం ఖరారు చేసుకున్న నేప‌థ్యంలో నిజంగానే...తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో శ్మ‌శాన వైరాగ్యం నెల‌కొంద‌ని అంటున్నారు.

పార్టీని బ‌లోపేతం చేద్దామ‌ని...శ్ర‌మించాల‌ని...అధికార పార్టీని ఇరకాటంలో ప‌డేయాల‌ని ఓవైపు అధినేత చంద్ర‌బాబు చెప్తుంటే...మ‌రోవైపు ఆ పార్టీకి చెందిన కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడే జంప్ అవ‌డంతో సైకిల్ పార్టీ నేత‌లు చ‌తికిలప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకోనున్నారు. దీపావ‌ళి మ‌రుస‌టిరోజైన శుక్ర‌వారం టీటీడీపీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు - పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించనున్నారు. మ‌రోవైపు పార్టీ ఈ ప‌రిణామంపై ఆచితూచి స్పందిస్తోంది. తెలంగాణలో పొత్తులపై ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగతమేనని - పార్టీ అభిప్రాయం కాదని టీడీపీ తెలిపింది. పొత్తులపై సరైన సమయంలో పార్టీ అధ్యక్షుడే నిర్ణయిస్తారని తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని టీడీపీ జాతీయ పార్టీ ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో కేడర్ ను కాపాడుకోవడం ప్రజా సమస్యలపై పోరాటంపైనే చర్చించామని వివ‌రించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యక్తులపై ఆధారపడదన్నారు. పార్టీ వీడతారనే అంశంపై రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరముందన్నారు.

ఇదిలాఉండ‌గా మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ తో టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భేటీ అయ్యారు. శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత‌గా ఉన్న‌ రేవంత్ రెడ్డి జంపింగ్ నేప‌థ్యంలో ఈ భేటీ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. లోకేష్ ప్ర‌త్యేంగా ఈ అంశంపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అయితేముందుగా తీసుకున్న అపాయింట్ మెంట్ మేరకే లోకేష్ తో భేటీ అయినట్లు సండ్ర తెలిపారు. పార్టీ బలోపేతానికి త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వివ‌రించారు.