Begin typing your search above and press return to search.

అంద‌రూ తిట్టాక.. టీటీడీ ఈవో మాట మారింది

By:  Tupaki Desk   |   17 July 2018 7:49 AM GMT
అంద‌రూ తిట్టాక.. టీటీడీ ఈవో మాట మారింది
X
ప‌న్నెండేళ్ల‌కు ఒక‌సారి శ్రీ‌వారి ఆల‌యంలో మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంటుంది. ఇది మొద‌ట్నించి ఉన్న‌దే. కొత్త‌గా వ‌చ్చిందేమీ కాదు. ఈ సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం వేళ స్వామివారి ద‌ర్శ‌నానికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ బూచి చూపించి.. తొమ్మిది రోజుల పాటు ఆల‌యాన్ని మూసివేస్తామ‌ని.. కొండ‌కు భ‌క్తుల్ని రానివ్వ‌మంటూ టీటీడీ ఈవో.. ఛైర్మ‌న్ స్థానాల్లో ఉన్న వారు అత్యుత్సాహ ప్ర‌క‌ట‌న‌ల్ని చేయ‌టం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. కోట్లాది మంది చావు తిట్లు తిట్టేలా చేసుకున్నార‌ని చెప్పాలి.

ఎంత మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మైతే మాత్రం ఏకంగా తొమ్మిది రోజుల పాటు స్వామి వారి ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు లేకుండా చేయ‌ట‌మే కాదు.. కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించే స‌మ‌యంలో సీసీ కెమేరాల్ని ఆపేస్తామ‌ని చెప్ప‌టంపై పెద్ద ఎత్తున అనుమానాలు.. సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. మ‌హాసంప్రోక్ష‌ణ విష‌యంలో ఏపీ స‌ర్కారు తీరును ప్ర‌తి ఒక్క‌రూ వేలెత్తి చూపించేవారే. చివ‌ర‌కు తెలుగుదేశం పార్టీ నేత‌లు సైతం త‌మ ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో త‌మ తీరు స‌రికాద‌న్న మాట‌ను చెప్ప‌టం క‌నిపించింది.

నాలుగువైపుల నుంచి విమ‌ర్శ‌ల వెల్లువ‌లో ప‌రిస్థితి చేజారిపోతుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న స్వ‌రాన్ని మార్చారు. మ‌హా సంప్రోక్ష‌న వేళ‌లో గ‌తంలో అమ‌లు చేసిన విధానాల‌కు అనుగుణంగానే భ‌క్తుల ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఉండాలని బాబు ఆదేశించారు. దీంతో.. టీటీడీ ఈవో సింఘాల్ స్వ‌రం మారింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఈ నెల 24న టీటీడీ బోర్డు స‌మావేశం అవుతుంద‌ని.. భ‌క్తుల ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు చేసే విష‌య‌మై చ‌ర్చించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

మ‌హా సంప్రోక్ష‌ణ సంద‌ర్భంగా రోజుకు మూడు నుంచి నాలుగు గంట‌ల పాటు రెండు విడ‌త‌లుగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు క‌ల్పించాల‌ని అనుకుంటున్న‌ట్లుగా చెప్పారు. అందుబాటులో ఉన్న స‌మ‌యం... భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఈ ఆలోచ‌న ఏదో మొద‌టే ఉంటే.. ఈ రోజున ఇంత మంది చేత ఇన్ని మాట‌లు అనిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు క‌దా?