Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ నేత కుటుంబ ర‌చ్చ‌..కేసీఆర్‌-కేటీఆర్ ఫైర్‌

By:  Tupaki Desk   |   21 Nov 2017 4:59 PM GMT
టీఆర్ ఎస్ నేత కుటుంబ ర‌చ్చ‌..కేసీఆర్‌-కేటీఆర్ ఫైర్‌
X
పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ క‌ట్టుత‌ప్పుతుండడం పై టీఆర్ ఎస్ పెద్దలు ఎట్ట‌కేల‌కు సీరియ‌స్ అయ్యారు. నిత్య పెళ్లికొడుకు - టీఆర్‌ ఎస్‌ పార్టీ యువజన నేత శ్రీనివాస రెడ్డి అరాచకాల ఎపిసోడ్‌ పై పార్టీ పెద్ద‌లు ఫైర్ అయిన‌ట్లు స‌మ‌చారం. శ్రీనివాస్‌ రెడ్డి ఓ మహిళను పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చి అనంతరం చందానగర్‌ కు చెందిన 24 ఏళ్ల సంగీతను 2013లో రెండో వివాహం చేసుకున్నాడు. భర్త - అత్తమామ అదనపు కట్నంకోసం సంగీతను వేధించారు. పాప పుట్టిందంటూ ఈ వేధింపులను మరింత ఎక్కువ చేశారు. దీంతో సంగీత పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్‌ రెడ్డి స్థానిక యువతి దేవీ జగదీశ్వరిని మూడో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సంగీత భర్త ఇంటికి వచ్చి అతన్ని నిలదీయగా - ఆమెను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో భర్తపై సంగీత ఒంటరి పోరు చేస్తోంది. ఈ వార్త మీడియాలో విప‌రీతంగా హైల‌ట్ అవ‌డంతో...ర‌థ‌సార‌థి కేసీఆర్‌ - ఆయ‌న త‌న‌యుడైన గ్రేట‌ర్ వ్య‌వ‌హ‌రాల ఇంచార్జీ మంత్రి కేటీఆర్ సీరియ‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది.

టీఆర్ ఎస్ పార్టీలోని విశ్వ‌స‌నీయ‌వర్గాల‌ స‌మాచారం ప్ర‌కారం శ్రీనివాస్ రెడ్డిపై టీఆర్ ఎస్ అధిష్టానం సీరియ‌స్ అయ్యింది. ఆడ‌బిడ్డ‌ను ఇంత ఘోరంగా హింసించిన వ్య‌క్తిపై చ‌ర్య‌లు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. పార్టీ పెద్ద‌లు మండిప‌డంతోనే తాము ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని స్థానిక నాయ‌కులు పేర్కొన్నారు.

కాగా, అతని భార్య సంగీత న్యాయ పోరాటం మూడవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే పోలీసులు శ్రీనివాస రెడ్డిని రిమాండ్‌కు తరలించగా .. అత్తామామలు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేది లేదని మూడోరోజు కూడా సంగీత ఆందోళన కొనసాగిస్తోంది. దీంతో శ్రీనివాస‌రెడ్డి ఇంటిముందు ఉద్రిక్త‌త నెల‌కొంది. కొంత‌మంది మ‌హిళ సంఘాల నేత‌లు స్థానిక ఎమ్మెల్మే సుధీర్ తో వాగ్విదంకు దిగారు. వెంట‌నే సంగీత అత్త‌మామ‌ల‌ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.