Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లో కొత్త టెన్ష‌న్ మొద‌లైందా?

By:  Tupaki Desk   |   24 April 2017 12:53 PM GMT
టీఆర్ ఎస్‌ లో కొత్త టెన్ష‌న్ మొద‌లైందా?
X
తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీలో కొత్త టెన్ష‌న్ మొద‌లైందా? పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న వ‌రంగ‌ల్ మ‌హాస‌భ విజ‌యవంతంపై సందేహాలు నెల‌కొన్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇందుకు కార‌ణం ఏమంటే...వేసవి తీవ్రత. ఎండ‌లు దంచేస్తుండ‌టం - బహిరంగ సభకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఏర్పాట్లపై సమాలోచనలు చేస్తున్న క్ర‌మంలో టీఆర్‌ ఎస్‌ నేతల్లో టెన్షన్‌ మొదలైందని టాక్‌. ఈ నెల 25 వరకు పూర్తిచేసి 26న రిహార్సల్‌ చేయాలని నిర్ణయించారు. జన సమీకరణే లక్ష్యంగా నియోజకవర్గాల సమీక్షలు మొదలయ్యాయి. వేసవి సందర్భంగా ఎగిసిపడుతున్న ఎండలు టీఆర్‌ ఎస్‌ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయని అంటున్నారు.

ఈనెల 27న జరిగే బహిరంగ సభ ఏర్పాట్లపై టీఆర్‌ ఎస్‌ నాయకుల్లో సంతృప్తి కనబడడం లేదని ఏదో లోటు ఉన్నట్లుగానే భావిస్తున్నారు. ఏర్పాట్లపై నిత్యం సమీక్షించుకుంటూ సమాలోచనలు చేస్తున్నారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో కుర్చీలు వేయాలని భావిస్తుండగా అది సాధ్యమవుతుందా అన్న ఆలోచనలో కూడా టీఆర్‌ ఎస్‌ శ్రేణులున్నాయి. సభా ఏర్పాట్ల బాధ్యతను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అప్పగించడంతో ఆయన హన్మకొండలోనే మకాం వేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. సభా నిర్వహణకు మరో 72 గంటల గడువు మాత్రమే ఉండడంతో రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు. 20 రోజుల ముందే పనులు ప్రారంభించగా ఎట్టి పరిస్థితుల్లోనైనా 25 నాటికి పూర్తి చేయాలని నిర్ణయిం చారు. ఆ తర్వాత లోటుపాట్లను సమీక్షించుకునే విధంగా రిహాల్సర్స్‌ చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా సౌండ్‌ సిస్టమ్‌ చెక్‌ చేయనున్నారు. దీంతోపాటు వేదికపై ఎందరు కూర్చుంటారన్న దానిని కూడా ఫైనల్‌ చేయనున్నారు. ఎవరిని ఎక్కడ కూర్చొబెట్టాలన్న విషయానికి రూపకల్పన చేయనున్నారు. రిహాల్సర్‌ చేయడం వలన ఎలాంటి లోటు పాట్లున్నా మళ్లీ సరిచేసుకోవచ్చునని భావిస్తున్నారు.

కాగా, జన సమీక్షకరణపై టీఆర్‌ ఎస్‌ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇతర జిల్లాల నుండి వచ్చే వారి సంఖ్య తక్కువేనన్న అంచనా వెలువ‌డుతోంది. ఉమ్మడి జిల్లా పరిధి నుండే భారీగా జన సమీకరణ చేయడంతోపాటు చుట్టుపక్కల ఉన్న సూర్యాపేట - భువనగిరి - కొత్తగూడెం - ఖమ్మం - కరీంనగర్‌ - సిద్దిపేట జిల్లాల నుండి కొంత మేరకు జనాన్ని తరలిస్తే బాగుంటుందన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందస్తుగా ఊహించినట్లు ఉపాధి కూలీలు - కాంట్రాక్ట్‌ - అవుట్‌ సోర్సింగ్‌ లో పనిచేసేవారు, అంగన్‌ వాడీ కార్యకర్తలు - మహిళా గ్రూపుల్లోని సభ్యుల్ని భారీగా తరలించాలని భావించారు. ఈనేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. వేసవి ఎండల నేపథ్యంలో వృద్ధులను సభకు తరలిస్తే ఏమైనా అనర్థాలు చోటు చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయిలోని టీఆర్‌ ఎస్‌ క్యాడర్‌ తోపాటు 45 ఏళ్ల‌లోపు ఉన్న వారిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. వేసవి ఎండల నేపథ్యంలో టీఆర్‌ ఎస్‌ సభకు జన సమీకరణ ఆ పార్టీ నాయకులకు సవాల్‌ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/