Begin typing your search above and press return to search.

బీజేపీపై ప్రతిదాడికి టీఆర్ ఎస్ రెడీ!

By:  Tupaki Desk   |   22 Aug 2019 5:29 AM GMT
బీజేపీపై ప్రతిదాడికి టీఆర్ ఎస్ రెడీ!
X
క‌మ‌ల‌నాథుల దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు గులాబీ పార్టీ రెడీ అవుతోంది. 2023లో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష‌మంటున్న ఆ పార్టీని నిలువ‌రించేందుకు సిద్ధం అవుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలుగుదేశం - ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా బలహీన పరిచే వ్యూహాన్ని అ మలుచేసిన టీఆర్ ఎస్ - ప్రస్తుతం బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు స‌మాయ‌త్తం అవుతోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌ తో పాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్న నేతలపై ఓ కన్నేయడంతో పాటు - టీఆర్ ఎస్‌ నుంచి బీజేపీలో చేరే అవకాశమున్న నేతల కదలికలను ఆరా తీస్తున్నట్లు స‌మాచారం.

గత నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛ‌నంగా ప్రారంభించగా - మూడు రోజుల క్రితం బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా పార్టీ తెలంగాణ టీడీపీ నేతల చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి నెలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు - వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లో ఎవరో ఒకరు తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేతలు అధికార టీఆర్ ఎస్‌ పార్టీ నాయకత్వం - ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తుండటంతో టీఆర్ ఎస్ అప్ర‌మ‌త్తం అయింది.

బీజేపీ నేతల విమర్శలు - ప్రకటనలను ఖండిస్తూనే - ఆపార్టీలోకి చేరిక‌ల‌ను అడ్డుకునేందుకు పావులు క‌దుపుతున్నట్లు సమాచారం. బీజేపీలో చేరికలతో టీ టీడీపీ క్లీన్‌ స్వీప్‌ కాగా.. క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్‌ ఉన్న కాంగ్రెస్‌ ను టార్గెట్‌ చేసేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తో పాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేందుకు అవకాశమున్న నేతలు ఎవరనే కోణంలో టీఆర్ ఎస్‌ వర్గాలు ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్‌ నుంచి వలస వెళ్లే నేతలను అడ్డుకుని - వారిని టీఆర్ ఎస్‌ లో చేరేలా ప్రోత్సహించే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

ఈక్ర‌మంలోనే బీజేపీతో ట‌చ్‌ లో ఉన్న సొంత‌ పార్టీ నేత‌ల‌పై టీఆర్ ఎస్ దృష్టి సారించింది. ‘స్థాయిలేని నేతలు బీజేపీలో చేరుతున్నారని’ ప్రకటిస్తున్న టీఆర్ ఎస్.... లోలోన మాత్రం పార్టీని వీడే అవకాశమున్న నేతల కదలికలపై ఓ కన్నేసింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఉన్న ముఖ్య నేతలు - అసంతృప్త వాదులను గుర్తించడంపై దృష్టి సారించింది. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత వీరిలో కీలకమైన వారికి నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టడం ద్వారా వలసలను అదుపు చేయాలని టీఆర్ ఎస్‌ యోచిస్తోంది. మొత్తానికి అధికార టీఆర్ ఎస్‌ - బీజేపీల వ్యూహాలు - ప్ర‌తివ్యూహాల‌తో తెలంగాణ‌లో రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారుతోంది.