Begin typing your search above and press return to search.

అవాక్క‌య్యేలా చేసిన కాంగ్రెస్ నిర్ల‌క్ష్యం

By:  Tupaki Desk   |   20 Sep 2018 5:55 AM GMT
అవాక్క‌య్యేలా చేసిన కాంగ్రెస్ నిర్ల‌క్ష్యం
X
నిర్ల‌క్ష్యం అనాలా? మ‌రింకేమైనా అనాలా? పార్టీకి సంబంధించి అత్యంత కీల‌క‌మైన జాబితాను విడుద‌ల చేసే వేళ‌.. ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోవ‌టం మామూలే. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ విష‌యంలో త‌ప్పులో కాలేసింది. మీడియా ప్ర‌తినిధుల‌ను అవాక్కు అయ్యేలా చేసి.. ఆపై కాంగ్రెస్ ఎప్ప‌టికి మార‌దే.. అని అనుకునేలా చేసింది.

తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం పార్టీ అధినాయ‌క‌త్వం కాంగ్రెస్ సైన్యాన్ని రెఢీ చేసింది. అసెంబ్లీ ర‌ద్దు అయి.. ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్లుగా కేసీఆర్ ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా కామ్ గా ఉన్న‌ట్లు క‌నిపించింది. దాదాపు రెండు వారాల పాటు ఎన్నిక‌ల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు ఏమీ జ‌ర‌గ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింది.

అయితే.. అండ‌ర్ క‌రెంట్ అన్న‌ట్లుగా తాను చేయాల్సిన క‌స‌ర‌త్తును పార్టీ లోలోప‌ల చేస్తుంద‌న్న విష‌యాన్ని తాజాగా విడుద‌ల చేసిన జాబితా స్ప‌ష్టం చేసింది.

బుధ‌వారం ఒకేసారి 10 జాబితాల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌.. వివిధ క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించిన కీల‌క విభాగాల‌ను వేర్వేరు క‌మిటీలుగా చేసి.. పార్టీకి సంబంధించిన ప్ర‌ముఖ నేత‌లంద‌రికి పెద్ద‌పీట వేస్తూ క‌మిటీల్లో చోటు క‌ల్పించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ క‌మిటీల్లో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన మాజీ స్పీక‌ర్ సురేశ్ రెడ్డి పేరును ఉంచి జాబితా విడుద‌ల చేయటం విశేషం. అంటే.. సురేశ్ రెడ్డి పార్టీ నుంచి వీడ‌టానికి ముందే జాబితాలు రెఢీ అయ్యాయా? లేక‌.. ఆయ‌న వెళ్లిన త‌ర్వాతే లిస్ట్ ను ప్రిపేర్ చేశారా? అన్న‌ది అర్థం కాని ప‌రిస్థితి. ఏమైనా పార్టీ నుంచి వెళ్లిన నేత పేరుతో జాబితా విడుద‌ల కావ‌టం చూస్తే.. పార్టీ యంత్రాంగం ఎంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుందోన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.