Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ కు తొలి దెబ్బ‌!..జీహెచ్ ఎంసీలో ఓట‌మి!

By:  Tupaki Desk   |   19 March 2018 10:14 AM GMT
టీఆర్ ఎస్‌ కు తొలి దెబ్బ‌!..జీహెచ్ ఎంసీలో ఓట‌మి!
X
టీఆర్ ఎస్‌... తెలంగాణ‌లో తిరుగు లేని పార్టీనే. తెలంగాణ‌ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావ‌డంలో కీల‌క భూమిక పోషించిన పార్టీగా - తెలంగాణ ఉద్య‌మాన్ని 14 ఏళ్ల పాటు స‌జీవంగా ఉంచ‌డంలో స‌క్సెస్ అయిన పార్టీగా - ఉద్య‌మ స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల‌ను ఒక్క‌తాటిపైకి తీసుకురాగ‌లిగిన పార్టీగా టీఆర్ ఎస్‌ కు నిజంగానే తెలంగాణ‌లో తిరుగులేని పార్టీ హోదానే ఉంద‌ని చెప్పాలి. అందుకే కాబోలు... 2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా బ‌రిలోకి దిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ను కాద‌ని జ‌న‌మంతా టీఆర్ ఎస్ ప‌క్షానే నిల‌బ‌డ్డారు. అంతేనా 2014కు ముందు తెలంగాణ ప్రాంతంలోని ప‌లు ప‌రిశ్ర‌మ‌లు - సింగ‌రేణి వంటి సంస్థ‌ల‌కు చెందిన కార్మిక సంఘం ఎన్నిక‌ల్లోనూ టీఆర్ ఎస్ ఘ‌న విజ‌యం సాధించింది. అంతేకాదండోయ్‌... 2012లో జ‌రిగిన జీహెచ్ ఎంసీ కార్మిక సంఘం ఎన్నిక‌ల్లోనూ టీఆర్ ఎస్ అనుబంధ సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ ఎంప్లాయిస్ యూనియ‌న్ (జీహెచ్ ఎంఈయూ) ఘ‌న విజ‌యం సాధించింది.

ఇక 2014 ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌లు - జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లు - ప‌లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అస‌లు టీఆర్ ఎస్‌ కు ఎదురు నిలిచే పార్టీలు - కార్మిక సంఘాలే క‌నిపించ లేదు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఏడాదిలో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ టీఆర్ ఎస్‌ కు తిరుగు లేద‌న్న భావ‌నే వినిపిస్తోంది. అయితే అనూహ్యంగా జీహెచ్ ఎంసీలో కాసేప‌టి క్రితం వెలువ‌డ్డ కార్మిక సంఘం ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ కు పెద్ద షాకే త‌గిలింది. జీహెచ్ ఎంసీ కార్మిక సంఘం ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అనుబంధ సంఘం జీహెచ్ ఎంఈయూ - బీజేపీ అనుబంధ కార్మిక సంఘం భాగ్య‌న‌గ‌ర్ మునిసిప‌ల్ ఎంప్లాయిస్ యూనియ‌న్ (బీఎంఈయూ) చేత‌లో ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఈ ప‌రాజ‌యం 2014 త‌ర్వాత టీఆర్ ఎస్ కు త‌గిలిన తొలి దెబ్బ‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్ప‌టిదాకా ఓట‌మ‌న్న‌దే ఎరుగ‌ని టీఆర్ ఎస్ తొలిసారిగా జీహెచ్ ఎంసీలోనే ఓట‌మిపాలు కావ‌డం, అది కూడా బీజేపీ చేతిలో ఓడిపోవ‌డంపై ఇప్పుడు పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

విజ‌యంపై ఏమాత్రం అంచ‌నాలు లేని బీఎంఈయూ... గెలుపుపై పూర్తి కాన్ఫిడెన్స్‌ తో బ‌రిలోకి దిగిన జీహెచ్ ఎంఈయూను ఏకంగా 1,317 ఓట్ల తేడాతో చిత్తు చేసింది. జీహెచ్ ఎంసీకి గ‌త కొంత కాల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో పూర్తి స్థాయిలో స‌త్తా చాటిన కేసీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు (కేటీఆర్‌) విప‌క్షాల‌కు పెద్ద షాకే ఇచ్చారు. టీడీపీకి సింగిల్ సీటును వ‌దిలిన కేటీఆర్ కాంగ్రెస్ కు కూడా ఊహించ‌ని రీతిలో దెబ్బ కొట్టేశారు. ఇక పాత‌బ‌స్తీలో మ‌జ్లిస్ పార్టీకి కాస్తంత సానున‌కూల ఫ‌లితాలు రాగా... మిగిలిన అన్ని ప్రాంతాల్లో టీఆర్ ఎస్ విజ‌య ప‌తాకం ఎగుర‌వేసింది. ఈ ఫ‌లితాల‌తో కేటీఆర్ రేంజి ఎక్క‌డికో వెళ్లిపోయింది. అప్ప‌టిదాకా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌...జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల త‌ర్వాత పుర‌పాల‌క‌ - ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగానూ ప‌ద‌వీ బాధ్య‌త‌లు ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో కేటీఆర్‌ కు - మొత్తంగా టీఆర్ ఎస్‌ కు జీహెచ్ ఎంసీ ప‌రిధిలో తిరుగు లేద‌న్న భావ‌నే వ్య‌క్త‌మైంది.

అయితే ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా బీజేపీ చేతిలో టీఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఓడిపోవ‌డం పెద్ద సంచ‌ల‌నంగానే మారిపోయింది. అంతేకాకుండా జీహెచ్ఎంఈయూ త‌ర‌ఫున డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ - హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి - ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి - ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ గౌడ్ త‌దిత‌రులు కాళ్ల‌కు చ‌క్రాలు క‌ట్టుకున్న మాదిరిగా ప్ర‌చారం చేశారు. అదే స‌మ‌యంలో బీజేపీ త‌ర‌ఫున చోటా మోటా నేత‌లు మిన‌హా పెద్ద నేత‌లెవ్వ‌రూ క‌నిపించిన దాఖ‌లా లేదు. అయినా కూడా బీజేపీ చేతిలో టీఆర్ ఎస్ ఓట‌మి పాలు కావ‌డం నిజంగానే ఆస‌క్తి రేకెత్తించేదే. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. జీహెచ్ ఎంసీ కార్మికుల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌ని కార‌ణంగానే జీహెచ్ ఎంఈయూ ఓట‌మి పాలైంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఓట‌మి నేప‌థ్యంలో టీఆర్ ఎస్‌ లో ఏ మేర మార్పు చేర్పులు ఉంటాయో చూడాలి.