Begin typing your search above and press return to search.

ఆశలన్నీ ఎంఐఎంపైనే..

By:  Tupaki Desk   |   19 Oct 2018 5:40 AM GMT
ఆశలన్నీ ఎంఐఎంపైనే..
X
ముందస్తు ఎన్నికలకు వచ్చినా కేసీఆర్ అనకున్నది జరిగే సూచనలు కనిపించకపోవడంతో టీఆరెస్‌ లో ఎక్కడ లేని కంగారు కనిపిస్తోంది. విపక్షాలన్నీ ఏకమై దూసుకెళ్తుండడంతో ఎన్నికల్లో గెలుపు కష్టమేనని ఇప్పటికే కేసీఆర్ అండ్ కోకు అర్థమైందని చెబుతున్నారు. బీజేపీతో సయోధ్య... ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ ఉంటాయని ఇప్పటికే చెప్పుకొన్నారు. అయితే.. బీజేపీతో టీఆరెస్‌ కు కానీ - టీఆరెస్‌ తో బీజేపీకి కానీ ఉపయోగం ఉన్నట్లు ఆ రెండు పార్టీలూ గుర్తించకపోవడంతో ఆ ఫార్ములా వర్కవుట్ అవదని టీఆరెస్ అర్థం చేసుకుంది. దీంతో చిట్టచివరి అవకాశంగా ఎంఐఎంను నమ్ముకోవాలని టీఆరెస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

అందులో భాగంగా టీఆరెస్ మరో వ్యూహం పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ లో టీఆరెస్ గెలవదు అనుకున్న కొన్ని చోట్ల ఎంఐఎం అభ్యర్థులను కూడా పోటీలో ఉంచాలనుకుంటున్నారట. అంతేకాదు.. కరీంగనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఎంఐఎంకు పట్టున్న ప్రాంతాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులను బరిలో దించనున్నట్లు సమాచారం. ఇంకొన్ని చోట్ల ఎంఐఎం శ్రేణులు పూర్తిగా టీఆరెస్‌ తరఫున ప్రచారం చేస్తాయి. ఈ ఫార్ములా వర్కవుట్ అయి టీఆరెస్ ఎంఐఎం సహకారంతో అధికారంలోకి రాగలిస్తే మంత్రివర్గంలో ఆ పార్టీకి ప్రాధాన్యం ఇస్తామని కూడా ఎంఐఎంకు హామీ ఇచ్చినట్లు టాక్.

ఈ మేరకు ఎంఐఎం అధినేత - హైదరాబాద్‌ లోక్‌ సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ ఇటీవల ప్రగతి భవన్‌ కు వెళ్ళి తాజా మాజీమంత్రి కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రివర్గంలో మరొకరికి అవకాశం ఇవ్వడానికి కేటీఆర్‌ అంగీకరించినట్టు సమాచారం.