Begin typing your search above and press return to search.

గులాబీ తాజా టార్గెట్ ‘‘స్థానికమే’’

By:  Tupaki Desk   |   1 Dec 2015 3:58 AM GMT
గులాబీ తాజా టార్గెట్ ‘‘స్థానికమే’’
X
తెలంగాణ అధికార పక్షం తాజా టార్గెట్ సెట్ అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న కొద్దిరోజుల్లో స్థానిక నేతలు గులాబీ కండువాలు కప్పుకోనున్నారు. ఇందుకోసం భారీగానే కసరత్తు సాగుతోంది. ఇంతకాలం స్థానిక సంస్థలకు చెందిన జెడ్పీటీసీలు.. ఎంపీటీసీలు.. మున్సిపల్ కౌన్సిలర్లు.. కార్పొరేటర్లను లైట్ తీసుకున్న టీఆర్ ఎస్ నాయకత్వం ఇప్పుడు వారి మీదనే ఎందుకు ఫోకస్ చేస్తుందంటే ఆసక్తికర కారణమే ఉంది.

వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే.. స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం జారీ చేసింది. ఈ ఎన్నికలు మొత్తం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చుట్టూనే తిరిగనున్నాయి. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ.. కార్పొరేటర్లు.. కౌన్సిలర్లే మండలి సభ్యల్ని ఎన్నుకోనున్నారు. అంటే.. స్థానికంలో ఎమ్మెల్సీ స్థానాలు భారీగా చేజిక్కించుకోవటాలంటే స్థానిక ప్రజా ప్రతినిధుల చేయూత ఎంతో అవసరం. ఎన్నికలకు తగినట్లుగా రాజకీయాల్ని నడపటంలో తలపండిన గులాబీ దళం ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల మీద దృష్టి సారించింది.

నిజానికి టీఆర్ ఎస్ కు స్థానిక సంస్థల్లో పెద్దగా పట్టు లేదు. అయితే.. అధికారపక్షమన్న ట్యాగ్ లైన్ తో పాటు.. ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తున్నారు. మహా.. మహా నేతలే.. పాహిమాం.. పాహిమాం అంటూ అదికారపక్షం అండ కోసం తపిస్తున్న సమయంలోనే తాజా ఎన్నికలు రావటం.. అధికారపక్షం కూడా స్థానిక సంస్థల నేతల కోసం దృష్టి సారించటంతో వ్యవహారం ఉభయ తారకంగా మారింది.

ఇంతకాలం వేర్వేరు పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు తెలంగాణ అధికారపక్షంలో భాగస్వామ్యం కావాలని భావించినా.. అందుకు తగిన లింకు దొరక్క ఆగిపోయిన వారు కొందరైతే.. అధికారపక్షానికి ఆసక్తి లేకుండా పార్టీలో చేరితే ఇబ్బందన్న ఉద్దేశంతో కాస్తంత బింకాన్ని ప్రదర్శించారు. ఎప్పుడు ఏ అస్త్రాన్ని తీయాలో.. ఎవరిని ఎలా తన దారికి తెచ్చుకోవాలో బాగా తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల్ని పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని భారీ షురూ చేశారు. దీంతో.. ఇప్పుడు సందడి వాతావరణం నెలకొంది.

ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో.. ఈ స్థాయిలో గులాబీ బాస్ ప్లాన్ చేస్తారని ఎంతమాత్రం ఊహించని విపక్షాలు.. నిన్నటి వరకూ తమ చుట్టూనే ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు రాత్రికి రాత్రి ప్లేటు మార్చేసి.. గులాబీ కండువాలు వేసుకోవటం షాకింగ్ గా మారింది. రానున్న కొద్ది రోజుల్లో ఇలాంటి షాకులు విపక్షాలకు భారీగా తగలటం ఖాయమంటున్నారు.